కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఆయన మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అధికారులు ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని ముఖ్యమంత్రికి వివరించారు.
1975లో యూనివర్సిటీకి కంచ గచ్చిబౌలిలో భూమి కేటాయించారు. కానీ యాజమాన్య హక్కులు బదిలీ చేయలేదు. రికార్డుల ప్రకారం సర్వే నంబరు 25లోని భూమిని ఎప్పుడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఐఎంజీ అకాడమీస్ భారత’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం 2004 ఫిబ్రవరి 3న హెచ్‌సీయూ నుంచి 400 ఎకరాలను ఆ సంస్థకు అప్పగించింది. దానికి బదులు గోపనపల్లిలో 397 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించింది. ఐఎంజీ భారతకు భూముల కేటాయింపులను 2006లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దానిపై ఐఎంజీ హైకోర్టుకు వెళ్లగా.. 2024 మార్చి 7న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఆ భూమి ఎప్పుడూ హెచ్‌సీయూలో అంతర్భాగం కాదు. అటవీ ప్రాంతమూ కాదు. హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూములను ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం కేటాయించింది అని ఉన్నతాధికారులు వివరించారు.