సిమ్లాలోని ఆక్లాండ్ హౌస్ స్కూల్ 2025 మార్చి 23న తమ విద్యార్ధులకు ఒక ఉత్తరువు జారీ చేసింది. మార్చి 28న పాఠశాలలో ఈద్ వేడుకలు జరుపుతామని, దానికోసం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి, రెండో తరగతి చదువుతున్న పిల్లలందరూ కుర్తా పైజమా, నెత్తిన చిన్న టోపీ ధరించి రావాలనీ ఆదేశించింది. అంతేకాదు. ఆ రోజు లంచ్‌బాక్స్‌లోకి రోటీ, పనీర్, సేమియా, డ్రై ఫ్రూట్స్ తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే విద్యార్ధులు ముస్లిం వస్త్రధారణలో ఇస్లామిక్ ఆహారం తినాలన్న మాట.
పాఠశాల యాజమాన్యం ఆదేశాల మీద విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచీ, హిందూ సంఘాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఆదేశాలు దేశపు లౌకిక సూత్రాల ఉల్లంఘన అని ‘దేవభూమి సంఘర్ష్ సమితి’ మండిపడింది. ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనల చేపడతామని, పాఠశాల యాజమాన్యం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది. ఎట్టకేలకు పాఠశాల యాజమాన్యం వెనుకడుగు వేసింది. విద్యార్ధులకు దేశంలోని విభిన్న సంస్కృతులను పరిచయం చేయడమే తమ లక్ష్యం అని చెప్పుకుంది.
నిజానికి ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. హిందువుల పర్వదినాలకు, దీక్షలకూ ఆంక్షలు పెట్టే పాఠశాలల గురించి తరచుగా వింటున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో సైతం చూస్తున్నాం. అయితే క్రైస్తవ, ముస్లిం పండుగలను మాత్రం బలవంతంగా పిల్లల మీద రుద్దడం పరిపాటి అయిపోయింది. ఇవాళ రంజాన్ సందర్భంగా అలాంటి కొన్ని సందర్భాలను చూద్దాం…
2024 సెప్టెంబర్ 15:
హర్యానా సోనిపట్ జిల్లా బదౌలీ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ సెకెండరీ పాఠశాలలో మత సామరస్యం పేరిట ఒక నాటకం ప్రదర్శిస్తూ అందులో హిందూ విద్యార్ధినులకు బురఖాలు, హిజాబ్‌లు ధరింపజేసారు. దానిపై విద్యార్ధినుల తల్లిదండ్రులు, స్థానిక హిందూ సంఘాలవారు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పారు. ఇంకెప్పుడూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమని మాట ఇచ్చారు.
2024 జులై 15:
గుజరాత్‌లోని వడోదరలో కర్నాలీ అంగన్‌వాడీ కేంద్రంలో హిందూ చిన్నారుల మీద ముస్లిం మత విధానాలను రుద్దుతున్నారు. ఈద్ సందర్భంగా విద్యార్ధినులతో స్కార్ఫ్‌లు ధరింపచేసారు, నమాజ్ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే శైలేష్ మెహతా ఆ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసారు. అంగన్‌వాడీలను విద్యా వ్యవస్థలుగానే ఉంచాలని కోరారు.
2024 ఏప్రిల్ 10:
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తమ విద్యార్ధులకు రంజాన్ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) సందర్భంగా ప్రీ-ప్రైమరీ విద్యార్ధులకు ఇస్లాంకు చెందిన కథలు చెప్పడం, సేమియా వంటి తీపి వంటకాలు పంచడం అనే టాస్క్ ఇచ్చారు. అలాగే మొదటి, రెండవ తరగతి పిల్లలకు రంజాన్ పండుగ సందర్భంగా ఒక దర్గాను వర్చువల్‌గా సందర్శించాలనీ, ఈద్ ప్రాముఖ్యతను వివరించాలనీ టాస్క్‌లు ఇచ్చారు.
2024 ఏప్రిల్ 10:
మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో జ్ఞానస్థలి విద్యాలయంలో విద్యార్ధులను కుర్తా, హిజాబ్ ధరించి రావాలని ఆదేశించారు. నిజానికి ఆ రోజు నవవర్షం (ఉగాది). వసంత నవరాత్రుల మొదటిరోజు. ఆ పర్వదినం హిందువులకు గొప్ప వేడుక సందర్భం. అలాంటి రోజు మగపిల్లలు కుర్తా పైజమా, స్కల్ క్యాప్… అలాగే ఆడపిల్లలు బురఖా లేదా హిజాబ్ ధరించి రావాలంటూ హిందూ పాఠశాల ఆదేశాలు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. విద్యార్ధుల తల్లిదండ్రులు, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలూ ఆ పాఠశాలకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేసారు. దాంతో ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పారు. విద్యార్ధుల స్కల్ క్యాప్‌లు, హిజాబ్‌లు తొలగిస్తామని చెప్పారు.
2023 సెప్టెంబర్ 27:
మధ్యప్రదేశ్ గుణ నగరంలో కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ప్రిన్స్ గ్లోబల్ ప్రైవేట్ స్కూల్‌లో మిలాదున్నబీ సందర్భంగా హిందూ విద్యార్ధినులను హిజాబ్ ధరించి రావలసిందిగా ఆదేశించారు. వారితో ఇస్లామిక్ పాటలు పాడించారు. నమాజ్ తరహాలో ప్రార్థనలు చేయించారు. ఇస్లాం గొప్పదనం గురించి బోధనలు చేసారు. ఈద్‌కు ఒక రోజు ముందు జరిపిన ఆ కార్యక్రమం వీడియోలు తర్వాత బైటపడ్డాయి. దాంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. చివరికి పాఠశాల యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఆ కార్యక్రమం నిర్వహించిన టీచర్‌ను, దానికి అనుమతి ఇచ్చిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్ క్రైస్తవుడు కాగా మొత్తం 18మంది టీచర్లలో 8మంది ముస్లిములు ఉన్నారు.
2023 జూన్ 30:
గుజరాత్‌లోని కఛ్ ప్రాంతంలో ముంద్రా నగర శివారు ప్రాంతం మాంగ్రా గ్రామంలోని పెరల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రైవేటు పాఠశాలలో ఈద్ అల్ అదా (బక్రీద్) సందర్భంగా ముందురోజు పిల్లలతో ముస్లిములుగా వేషాలు వేయించారు. వారికి స్కల్ క్యాప్స్ పెట్టించి, ఇస్లామిక్ ప్రార్థనలు చేయించారు. ఆ వీడియో బైటపడడంతో గొడవ జరిగింది. జిల్లా ప్రాథమిక విద్యా విభాగం అధికారి సంజయ్ పర్మార్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రీతీ వాస్వానీని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసిందని వివరించారు.
2023 జూన్ 30:
మధ్యప్రదేశ్ ఖాండ్వా నగరంలోని సెయింట్ పయస్ సీనియర్ సెకెండరీ స్కూల్ అనే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో బక్రీద్ ముందు రోజు పాఠశాల విద్యార్ధులు అందరిచేతా కల్మా, ఖురాన్ చదివింపజేసారు. ముస్లిం విద్యార్ధులను డయాస్ మీదకు పిలిచి, వారితో ఇస్లామిక్ కల్మా, ఖురాన్ చదివించి, వాటిని మిగతా విద్యార్ధులందరూ చదివేలా చేసారు. ఆ విషయం తెలిసిన హిందూ విద్యార్ధుల తల్లిదండ్రులు స్థానిక విశ్వ హిందూ పరిషత్ నాయకుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఆ పాఠశాలలో హిందూ విద్యార్ధులు చేతికి కాశీ తాడు కట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, కడియాలు ధరించకూడదు, చెవులకు జుంకీలు, కాళ్ళకు పట్టీలు, కూడా ఉండకూడదు. కానీ ముస్లిం విద్యార్ధుల కోసం హిందూ విద్యార్ధులు అందరూ కల్మా, ఖురాన్ చదవాల్సి వచ్చింది.
2023 ఏప్రిల్ 29:
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక పాఠశాలలో ఈద్ వేడుకలు నిర్వహించారు. విద్యార్ధులకు ఇష్టం లేకుండా వారితో నమాజ్ చేయించారు. బడిలో ఎక్కువశాతం విద్యార్ధులు హిందువులే అయినప్పటికీ, ముస్లిమేతర విద్యార్ధులతో ఈద్ పండుగ జరిపించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. బజరంగ్ దళ్ నాయకులు వస్తున్నారని తెలిసి, సమస్య పెద్దదవుతుందని భావించి పాఠశాల యాజమాన్యం ఆ వీడియోలను అప్పుడే డిలీట్ చేయించేసింది.
అంతకు కొద్దిరోజుల ముందే డూన్‌లోని ఒక పాఠశాల నిర్వాహకులు పిల్లలను హోలీ ఆడుకోనీయకుండా నిలిపి వేసారు. అదే విద్యార్ధులు ఈద్ తప్పకుండా జరుపుకోవాలంటూ ఆదేశించారు. దాంతో హిందై సంస్థల ప్రతినిధులు రంగంలోకి దిగారు, పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించారు.
2022 మే 4:
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ దగ్గర ఝాన్సీలోని న్యాయనగర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మీద ఎఫ్ఐఆర్ నమోదయింది. మతపరమైన సెంటిమెంట్లను గాయపరచినందుకే ఆమెపై కేసు నమోదు చేసామని పోలీసులు వివరించారు. ఆ ప్రిన్సిపాల్ బడిలోని విద్యార్ధులు అందరినీ ఈద్‌కు అనుగుణంగా దుస్తులు ధరించి, ఈద్ శుభాకాంక్షలు చెబుతూ 20 సెకండ్ల వీడియోలు తీసి తనకు పంపించాలని డిమాండ్ చేసారు. ఆ విషయం బైటపడడంతో ప్రిన్సిపాల్ మీద కేసు నమోదు చేసారు.
ఇలా… హిందూ అస్తిత్వం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు ముస్లిముల పండుగలను మాత్రం హిందువుల మీద బలవంతంగా రుద్దుతున్నారు. లౌకికవాదం పేరిట హిందూమత ఆచారాల మీద ఆంక్షలు విధించినా పన్నెత్తి మాట్లాడకూడదు కానీ పరమత సహనం పేరిట హిందూ విద్యార్ధులతో ఇస్లామిక్ ఆచారాలను, సంప్రదాయాలనూ, ఆఖరికి వారి చిరుతిండ్లనూ అలవాటు చేస్తున్నారు. ఈ బలవంతపు ఈద్ వేడుకలు మాత్రం లౌకిక భారతానికి ప్రమాదం కాదా?