అస్సాంలో ఒక హిందూ యువకుడు ముస్లిం యువతిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ ముస్లిం యువతి కుటుంబ సభ్యులు, హిందూ యువకుడి తల్లిని, చెల్లినీ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు.
దిబ్రూగఢ్ జిల్లా లాలూకా గ్రామానికి చెందిన తపన్ దాస్ 28ఏళ్ళ యువకుడు. ఈ యేడాది ఫిబ్రవరి 14న అతను ఒక ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అప్పటినుంచీ ఆ యువతి కుటుంబ సభ్యుల నుంచి అతనికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. తపన్ దాస్ తల్లినీ, చెల్లినీ చంపేస్తామంటూ వేరేవేరే ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.
తాజాగా, తపన్ దాస్ తల్లికి మొన్న గురువారం మార్చి 27న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈద్ లోగా తన కొడుకునూ, కోడలినీ అప్పగించాలనీ… లేని పక్షంలో ఆమెను, ఆమె కూతురినీ చంపేస్తామని బెదిరించారు. ‘మీ ఇంటికి గూండాలను పంపిస్తాం, వాళ్ళు నిన్నూ, నీ కూతురినీ ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారు’ అని బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తపన్ దాస్, అతని ముస్లిం భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తపన్ తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తన భర్త చనిపోయారనీ, తననూ తన కూతురినీ చూసుకోడానికి ఎవరూ లేరనీ ఆమె వివరించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నందున దోషులను అరెస్ట్ చేసి చట్టం ప్రకారం శిక్షించాలని తపన్ తల్లి పోలీసులకు విజ్ఞప్తి చేసారు.