వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదపు సుమారు 150 యేళ్ళ నాటి తాళపత్ర గ్రంథం తమిళనాడులోని తిరుపత్తూరులో లభించింది. వాల్మీకి రామాయణాన్ని తమిళంలో మహాకవి కంబర్ ఆరు సంపుటాలుగా అనువదించారు. దాన్ని చోళ రాజుల కాలంలో శ్రీరంగంలో ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు లభించడం, తమిళనాడులో ఎన్నో తరాలుగా సంస్కృత, తమిళ రామాయణాలు రెండింటినీ పారాయణం చేసే సంప్రదాయం ఉందని నిర్ధారించడం విశేషం.
తిరుపత్తూరులోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రాజగోపురాన్ని పరిశీలిస్తున్నప్పుడు అందులో దాచి ఉంచిన ప్రాచీన తాళపత్ర రాతప్రతులు ఐదు కట్టలు లభించాయి. ఆ విషయాన్ని తిరుపత్తూరు సర్కిల్ ఇనస్పెక్టర్ నరసింహమూర్తి రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులకు తెలియజేసారు. ఆ తాళపత్రాలను పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ తమిళనాడు స్క్రోల్ ప్రాజెక్ట్ జాయింట్ కమిషనర్ హరిప్రియ ఒక బృందాన్ని ఆ ఊరికి పంపించారు.
స్క్రోల్ ప్రాజెక్ట్ సమన్వయకర్త తామరై పాండియన్ ఆ తాళపత్ర గ్రంథాల వివరాలు మీడియాకు తెలియజేసారు. మొత్తం ఐదు కట్టల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో 2075 తాళపత్రాలు ఉన్నాయి. వాటిలో వాల్మీకి రామాయణంలోని బాల కాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ ఉన్నాయి. ఒక్క యుద్ధకాండ మాత్రం దొరకలేదు. బహుశా దాన్ని చెదలు లేదా పురుగులు తినేసి ఉండాలి లేక ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపించడం వల్ల పాడైపోయి ఉండాలి.
ఈ తాళపత్ర గ్రంథాలను కనుగొనడం మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అదేంటంటే తమిళనాడులో కంబ రామాయణం లాగే వాల్మీకి రామాయణానికి కూడా ప్రజాదరణ అమితంగా ఉండేదని తెలుస్తోంది. శ్రీరామ నవమికి కొద్ది రోజుల ముందే ఈ విషయం వెలుగు చూసింది.
ఆ తాళపత్రాలను గ్రాఫాలజిస్టులు అధ్యయనం చేసారు. వాటిలోని అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే ఆ చరణాలు ‘వాళి సువాది’ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తాళపత్రాలు కనీసం 125 ఏళ్ళ నాటివని అంచనా వేసారు. అయితే ఆ మూల రచన మాత్రం కనీసం 300 ఏళ్ళ నాటిదని అంచనా వేసారు. ఆ తాళపత్ర గ్రంథాల రాత ప్రతుల మీద ‘శ్రీ రామాయణ కథ’ అని పేరు ఉంది. వాల్మీకి రామాయణాన్ని అత్యద్భుతంగా సంభాషణల రూపంలో రాసారు. సంస్కృతం మీద పెద్దగా పట్టు లేని స్థానిక తమిళులకు సైతం ఆ గ్రంథం ఆద్యంతం సులువుగా అర్ధమయ్యేలా ఉంది.
ఆ తాళపత్ర ప్రతులను పరిశీలించిన నిపుణులు, అందులో చాలావరకూ పుటలు కాలక్రమంలో క్షీణించిపోయాయని కనుగొన్నారు. సుదీర్ఘకాలం ఒకేచోట ఉండిపోయి ఉన్నందున ఫంగస్ పెరిగి, ఆ పత్రాలు పాడైపోయాయని తేల్చారు. అయితే ఆ తాళపత్ర గ్రంథాలను రసాయనిక చర్యల ద్వారా శుభ్రం చేయడం సాధ్యమేనని చెప్పారు. వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదం, అందునా తాళపత్ర గ్రంథాల్లో ఉండడం, అత్యంత అరుదైన విషయం కాబట్టి వాటి పునరుద్ధరణ, పరిరక్షణ పనులు తాము చేపడతామని హామీ ఇచ్చారు.
గత నవంబర్‌లో కూడా తమిళనాడు రాష్ట్రంలోనే వానియంబాడి దగ్గర గుడిలో ప్రాచీన రామాయణం వ్రాతప్రతులు లభించాయి. అవి 250 సంవత్సరాల నాటి పురాతన ప్రతులు అని నిర్ధారణ అయింది. ఒక క్షేత్రస్థాయి సర్వేలో ఈ తాటిఆకుల రాతప్రతులు దొరకడం వల్ల, శ్రీరాముడిని ఆరాధించే సంస్కృతి తమిళనాడు అంతటా ఉండేదని మరోమారు నిర్ధారణ అయింది. రాముడు ఉత్తరాది వాడు, అతనికి దక్షిణ భారతదేశానికీ సంబంధం లేదు అనే వాదనలను ఈ తాళపత్రాలు పూర్వపక్షం చేసాయని చెప్పవచ్చు.
ద్రవిడ పార్టీలు రామాయణాన్ని కల్పన అని కొట్టిపడేస్తాయి. రాముడు భగవంతుడు కాదని, ఒక ఊహాత్మక కాల్పనిక పాత్ర మాత్రమే అని, అతను ఉత్తర భారతదేశానికి చెందిన వాడు మాత్రమేననీ వాదిస్తుంటాయి. సేతు సముద్రం ప్రాజెక్ట్ వివాదం సమయంలో కరుణానిధి వ్యంగ్యంగా ‘రాముడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నాడు’ అని ప్రశ్నించాడు. ద్రవిడ పార్టీల లెక్క ప్రకారం దైవాలందరూ ఉత్తర భారతదేశం నుంచి దిగుమతి అయిన వాళ్ళే. కానీ ఆ కథనాన్ని అంగీకరించేవారు చాలా తక్కువమంది మాత్రమే. దానికి భిన్నంగా, కేరళలో ఒక నెల మొత్తాన్ని రామాయణానికి పారాయణం చేయడానికి కేటాయిస్తారు. ఆ నెల రోజులూ మళయాళ సీమలో ప్రతీ ఇంటిలోనూ రామాయణమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రామాయణం జాతీయ గ్రంథం కాదు, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన రచన అనే విషయం నిర్ధారణ అయిందని ప్రకటించడం విశేషం.
నిజానికి నేటికీ అమెరికా సహా పలు దేశాల్లో రామాయణాన్ని అనుసరిస్తారు. శ్రీలంక, థాయ్‌ల్యాండ్, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా వంటి దేశాల్లో రామాయణం నిత్య పారాయణ గ్రంథం. చాలావరకూ ఆగ్నేయాసియా దేశాల సాంస్కృతిక వారసత్వంలో రామాయణానిదే పెద్ద పాత్ర.
మన దేశంలో రామాయణాన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ అనువదించారు. ఆగ్నేయాసియా దేశాల భాషలతో పాటు తమిళం, హిందీ, కన్నడం, ఒడియా, తెలుగు, తుళు, బెంగాలీ తదితర భాషల్లోకి రామాయణాన్ని అనువదించారు. అసలు తమిళనాడులోని చాలా పుణ్యక్షేత్రాలకు రామాయణమే పుట్టినిల్లు. రామేశ్వరం, మారియూర్, వళ్ళినొక్కం, జాంబవాన్ ఓడై, తడగై మలై, విల్లుకీరి, విజయపతి, గుగన్‌పరై, తిరుమలై, కూన్‌తలూర్, వళంగైమాన్, పొయ్‌మన్‌కారడు, వారాటికుప్పం, తుడైయూర్, పడగచేరి, ఇరగుచేరి, కళుగత్తూర్, వెల్లైక్కారడు, వనరముట్టి, రామనాథపురం, రామర్ పత్తం, ఉప్పూరు, కేండా మతనపర్వతం, దేవీపట్టణం, నవభాషణం, తిరుపుల్లని, సేతుక్కారై, రామసేతు, శ్రీరంగం, ఆళ్వార్ తిరునగరి వంటి ప్రదేశాలన్నీ రామాయణంతో సంబంధం ఉన్నవే.