ఏపీలో వైసీపీ పాలనలో రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ టీడీపీ పార్లమెంటరీ నేత,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరారు. ఏపీ మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం సముద్రంలో నీటి బొట్టంతేనని వ్యాఖ్యానించారు. ఇన్‌ఫ్రా కంపెనీ పేరుతో సునీల్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం అవినీతి ద్వారా పోగేసిన రూ.2 వేల కోట్లు దుబాయ్ తరలించారని దీనిపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే, అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, రూ.4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందని సభ దృష్టికి తీసుకొచ్చారు.లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై మాట్లాడారు.
అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేశారని, 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయానికి ఏపీలో రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు ఉందని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో వ్యవసాయరంగం వృద్ధి దేశంలో 17 నుంచి 14.4 శాతానికి పడిపోయిందన్నారు. ఏపీలో మాత్రం 24 నుంచి 35 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. ఇదే సమయంలో సేవారంగం వాటా 51 శాతం నుంచి 41 శాతానికి పతనమైందన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఎంపీ కోరారు.
ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలనలో మద్యంలో అవినీతి బాహుబలి, పుష్ఫ, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల ఆదాయాన్ని మించి పోయిందన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అందుకే వైసీపీ ఎంపీకి ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసి పారిపోయాడన్నారు. సినిమాల్లో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుందని, ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలోనూ అదే చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి రాక ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక పేదలు తాగలేని విధంగా మద్యం ధరలు పెంచామన్నారు. మరోవైపు తక్కువ ధరలకు అమ్మాలంటూ అంతర్జాతీయ బ్రాండ్లను తరిమికొట్టారని గుర్తుచేశారు. ఏపీలో 22 మద్యం తయారీ డిస్టలరీలు స్వాధీనం చేసుకుని, మరో 26 కొత్తవి ఏర్పాటు చేసి నాణ్యత లేని మద్యం అత్యధిక ధరలకు అమ్మి వేల కోట్లు కాజేశారని ఎంపీ ఆరోపించారు. ఈ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టాలని కోరారు.
దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని, 2019 నుంచి 2024 మధ్య కాలంలో లక్ష కోట్ల డిజిటల్ లావాదేవీల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. అయితే ఏపీలో మాత్రం ఐదేళ్ల వైసీపీ పాలనలో 99 వేల కోట్ల మద్యం వ్యాపారంలో కేవలం, రూ.690 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయని, ఇది రివర్స్‌లో జరిగిందన్నారు. ఏపీలో రూ.18 వేల కోట్లు మద్యంలో అక్రమాలు జరిగాయని, ఇదంతా ప్రజల సొమ్మేనని దర్యాప్తు చేపట్టాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.