రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు రాయలసీమలో పంటలను దెబ్బతీసాయి. శని, ఆదివారాల్లో ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల్లో వడగళ్ళ వానలు, ఈదురుగాలులు అరటి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నాశనమవడంతో రైతుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది.
ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలంలో 2455 ఎకరాల విస్తీర్ణంలో కోతకొచ్చిన అరటి పంట నాశనమైపోయింది. కోమన్నూతల, పార్నపల్లె, మురారిచింతల, వెలిదండ్ల తదితర గ్రామాల్లో పంట నేలవాలింది. తాతిరెడ్డిపల్లె, ఎగువపల్లె, దిగువపల్లె, పెద్దకుడాల, చిన్నకుడాల తదితర గ్రామాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న అరటి దెబ్బతింది. వడగళ్ళ వానకు అరటి గెలల మీద మచ్చలు వచ్చాయని, ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలనీ రైతులు కోరుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు బిటెక్ రవి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1760 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో అరటి పంట తీవ్రంగా నష్టపోయింది. స్థానిక ఎంపీ లక్ష్మీనారాయణ యల్లనూరు మండలంలో ఆదివారం పర్యటించి, దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. రైతులను ఎలాగైనా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇద్దరు రైతుల ఆత్మహత్యా ప్రయత్నం:
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీరజంపల్లికి సంబంధించిన చిన్నవెంగప్ప, లక్ష్మీనారాయణ ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. కుటుంబ సభ్యులు సరైన సమయంలో వారిని గమనించడంతో పెను ముప్పు తప్పింది. వారిప్పుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వా ఆష్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చినవెంగప్ప 11 ఎకరాల్లోనూ, లక్ష్మీనారాయణ 10 ఎకరాల్లోనూ అరటి తోట వేసారు. ఒక్కొక్కరూ రూ.15లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్తే నేలవాలిపోయి ఉన్న పంట కనిపించింది. అధికారుల దగ్గరకు వెడితే వారు పంటనష్టం అంచనా వేయకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడడంతో వారిద్దరూ కుంగిపోయారు. అప్పులు తీర్చలేమనే బాధతో ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. స్థానిక సీఐ సత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం సమీక్ష:
రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో, విభాగం ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
వడగళ్ళ వానలు, ఈదురు గాలుల కారణంగా వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. 1670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1364మంది రైతులు నష్టాల పాలయ్యారు అని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేసారు.