తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు ఒకే పేరు ఉంటే పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లు మారుస్తున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభ సమావేశాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెలంగాణ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసారని, గోల్కొండ పత్రిక నడిపారనీ గుర్తు చేసుకున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడంటూ నివాళులర్పించారు. ఆయన పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడం తెలంగాణ సమాజానికి గౌరవమన్నారు. అదే సమయంలో తెలుగు వర్సిటీకి తీసేసిన పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఆ మేరకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తానని చెప్పారు.
ఆ క్రమంలోనే, బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయానికి రోశయ్య పేరు పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. అక్కడ రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ శాసనసభలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, దేవదాయ చట్టం సవరణ బిల్లులను కూడా రాష్ట్ర మంత్రులు ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దామోదర రాజనరసింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును పొన్నం ప్రభాకర్, దేవదాయ చట్ట సవరణ బిల్లును కొండా సురేఖ ప్రవేశపెట్టారు.