తెలంగాణలో మొదటిసారి రోప్‌వే టూరిజాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్-వరంగల్ హైవే నుంచి భువనగిరి కోట దగ్గరకు ఒక కిలోమీటరు పొడవున రోప్‌వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది.
భువనగిరి కోట మీదకు రోప్‌వే ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు రూ.56.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో రోప్వేకు రూ.15.2 కోట్లు… యాక్సెస్ రోడ్డు-పార్కింగ్ ఏర్పాట్లకు రూ.10.73కోట్లు… ప్రవేశద్వారం, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, పర్యాటక సదుపాయాల కోసం రూ.10.37కోట్లు… ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9.40 కోట్లు… మిగతా ఏర్పాట్ల కోసం రూ.11.11 కోట్లు… అంచనా వేసారు.
భువనగిరితో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు చోట్ల కూడా రోప్‌వే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పర్వతమాల పథకం కింద వాటిని మంజూరు చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి 2 కిలోమీటర్ల పొడవున రోప్‌వే వేయాలని ప్రతిపాదించింది. నల్లగొండ పట్టణంలో హనుమాన్ కొండ మీదకు 2 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీద 5 కిలోమీటర్లు, మంథనిలోని రామగిరి కోట వరకూ 2 కిలోమీటర్ల పొడవైన రోప్‌వేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఇవన్నీ సాకారమైతే తెలంగాణ పర్యాటకానికి మరింత కళ వస్తుందనడంలో సందేహం లేదు. దేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దయెత్తున కృషి చేస్తున్న కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు