మొదటి భాగం తరువాయి…..
రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై ముస్లిముల దాడి: పవన్ స్పందన ఏదీ?
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయంలో 2025 మార్చి 4న పారువేట ఉత్సవం జరిగింది. ఆ సందర్భంగా నగరంలో భజనలు, సంకీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంలో పారువేట ఉత్సవం, ఊరేగింపు, శోభాయాత్ర ప్రతీయేటా జరుగుతున్నాయి.
ఇన్నేళ్ళలో ఎప్పుడూ లేనిది, ఈ సంవత్సరం ఊరేగింపు మీద ముస్లిములు దాడి చేసారు. మసీదులోపలి నుంచి బైటకు వచ్చి, ఊరేగింపులో ఉన్న భక్తుల మీద రాళ్ళు రువ్వారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. పోలీసు అనుమతి తీసుకుని జరుపుకున్న ఊరేగింపు మీద ముస్లిములు దాడి చేస్తే పోలీసులు ఇరుపక్షాల మీదా కేసులు పెట్టారు. చిత్రమేమంటే రాళ్ళదాడులు చేసిన ముస్లిం మూకల మీద ‘గొడవ చేసినందుకు’ కేసులు పెట్టారు. దైవం మీద భక్తితో ఊరేగింపులో పాల్గొన్న హిందువుల మీద ‘హత్యాయత్నం’ కేసులు పెట్టారు. దాన్నిబట్టే పోలీసులు ఎవరి పక్షం వహించారో స్పష్టంగా అర్ధమవుతోంది. అంతేకాదు, దైవం మీద భక్తితో ఊరేగింపులో పాల్గొన్న హిందూ భక్తురాళ్ళతో ఎస్ఐ నరసింహారెడ్డి అనుచితంగా వ్యవహరించాడు, అసభ్యమైన వ్యాఖ్యలు చేసాడు.
ఆ సంఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేసాయి. నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసాయి. బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆ విషయాన్ని రాష్ట్ర శాసనసభలో సైతం ప్రస్తావించారు. పోలీసుల అనుచిత ప్రవర్తనను నిలదీసారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, హోంశాఖ ఉదాసీనంగా వ్యవహరించకూడదనీ డిమాండ్ చేసారు.
ఆ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ అధికారికంగా ఇప్పటివరకూ స్పందించలేదు. ముస్లిములకు ఉన్నట్లే హిందువులకూ హక్కులు ఉంటాయి అని జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చే పవన్ కళ్యాణ్, హిందువుల ఊరేగింపు మీద ముస్లిములు దాడి చేసినప్పుడు అలా చేయడం సరైనది కాదని ముస్లిములకు హితబోధ చేయడం సంగతి పక్కన పెడితే, కనీసం హిందువులకు అండగా ఒక్క ట్వీట్ అయినా చేయలేదు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రాయశ్చిత్తం పేరుతో ఇంద్రకీలాద్రి మెట్లు కడిగిన పవన్‌కళ్యాణ్‌కు వీరభద్రుడి ఊరేగింపుపై ముస్లిముల దాడి తప్పు అనిపించినట్లు లేదు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాల పర్యటన చేసిన పవన్ కళ్యాణ్‌కు ఆ కుమారస్వామి తండ్రి అవతారమైన వీరభద్రుడి శోభాయాత్ర మీద ముస్లిముల దాడి అపచారం అనిపించినట్లు లేదు. సామరస్యం రెండువైపుల నుంచీ ఉండాలంటూ సాధారణ సమయాల్లో సమన్వయ సరస్వతిలా ప్రవచించే పవన్ కళ్యాణ్‌కు రాయచోటిలో హిందువుల ఊరేగింపు మీద దాడి చేయడం ముస్లిముల తప్పు అని నేరుగా నిర్దిష్టంగా చెప్పడం అవసరం అనిపించినట్లు లేదు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ నుంచి ఆమాత్రం ఆశించడం తప్పు కాదు కదా.
(సశేషం)