బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక హిందూ వ్యాపారిని నలుగురు గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. మార్చి 9 ఆదివారం రాత్రి ఢాకాలో దిలీప్ దాస్ (47) అనే మీద దుండగులు దాడి చేసి చంపేసారు.
దిలీప్ దాస్ ఢాకాలోని అషూలియా ప్రాంతంలోని నయర్హాట్ బజార్ దగ్గర బంగారం దుకాణం నడుపుతుండేవాడు. ఆదివారం రాత్రి తన భార్యతో కలిసి దుకాణం మూసివేస్తుండగా అతన్ని దుండగులు కత్తితో నరికేసారు. వారు నాటుబాంబులు కూడా విసిరారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
దిలీప్ దాస్‌ను ఢాకాలోని ఇనామ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న దిలీప్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
దిలీప్‌పై దాడి చేసిన తర్వాత దుండగులు అతని దుకాణం నుంచి 25 భోరీల (సుమారు 291 గ్రాముల) బంగారాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేసినప్పుడు ఆ విషయం బైటపడింది. ఆ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు.