ప్రజలకు చేసిన మంచి పనులను, వారికి వివరించి చెప్పుకోవాలని, అప్పుడే ప్రజలు తమ పక్షాన నిలిచి గెలిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన లిమిట్లెస్ ఇండియా చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రధాని మోదీ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నారని, ఇది అనేక సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుందన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ లేదా నెంబర్ టూ ఉంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో అందరికంటే ముందే 1995లో తాను ఐటీ గురించి మాట్లాడితే కొందరు హేళన చేశారని, తాను హైదరాబాదులో నాడు వేసిన ఐటీ పునాదులపై నేడు అక్కడ ఓ వ్యవస్థ ఏర్పడిందన్నారు. 2004లో గెలిచి ఉంటే హైదరాబాద్ మరోలా ఉండేదన్నారు. తాను ముగ్గురు ప్రధాని మంత్రులతో పోరాడి, చివరకు వాజపేయి ప్రధానిగా ఉండగా టెలికం వ్వవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయించానని గుర్తుచేశారు. గతంలో బీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యంలో టెలికం వ్యవస్థ ఉండేదని దాన్ని తొలగించిన తరవాత ప్రతి మనిషి చేతికి సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందన్నారు.
2004, 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు తమను ఓడించలేదని చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. తనను జైల్లో వేసినా మరింత బలంతో ముందుకు సాగుతున్నానని గుర్తుచేశారు. అభివృద్ధి, ఆకాంక్షల్లో మునిగి, చేసిన పనులకు ప్రజలకు చెప్పుకోలేకపోతే ఓటమి తప్పదన్నారు. రాజకీయాల్లో గెలిచి తీరాలనే విషయాన్ని తాను ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నానన్నారు.
దేశంలో హద్దులు లేని అవకాశాలు రాబోతున్నాయి. మారుమూల ప్రాంతంలో కూర్చొని ప్రపంచంలో ఏ దేశానికి చెందిన పని చేసేందుకైనా అవకాశం లభించిందన్నారు. దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిదీ సాంకేతికతతో నడుస్తోందని, ప్రతి ఒక్కరూ సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏఐ నడిపించబోతోందన్నారు.
ఒకప్పుడు యూదుల గురించి చెప్పుకునే వారిమని, వారు చాలా మేధావులని అన్నారు. ఇప్పుడు భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నారని, అమెరికాలో తలసరి ఆదాయం కన్నా, అక్కడి భారతీయుల తలసరి ఆదాయం రెట్టింపు ఉందని గుర్తుచేశారు. సంపన్న సమాజం ఎక్కడ ఉన్నా వారిలో భారతీయులు ఉంటారని చంద్రబాబునాయుడు చెప్పారు.