‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించింది.
ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం గురించి యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా ప్రశ్నించాడు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సేషన్ కోసం దిగజారి మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీనిపై సదరు యూట్యూబర్ క్షమాపణ చెప్పడంతో పాటు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లు కొట్టివేయాలని వాటిన్నింటిని కలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సూర్య కంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం, రణ్ వీర్ అల్హాబాదియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను వాడిన భాషను తప్పుపట్టింది. అల్లాబదియా మదిలో చెడు ఆలోచనలు ఉన్నాయని, వాటిని షో వేదికగా బయటపెట్టాడని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
సమాజ విలువలు, పరిమితులు తెలుసా అని కోర్టు అతడని ప్రశ్నించింది. భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అని హితవు పలికింది. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. రణవీర్ తీరుతో కూతుళ్లు, సోదరీమణులు,తల్లిదండ్రులు, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ధర్మాసనం మండిపడింది.