ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. విషయం బైటపడడంతో పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్లో మొన్న ఆదివారం నాడు (ఫిబ్రవరి 9) ఒక నోటీసు ప్రత్యక్షమైంది. సర్ షా సులేమాన్ హాల్ డైనింగ్ కమిటీ పేరిట జారీ చేసిన ఆ నోటీసులో ఆదివారం భోజనంలో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన మహమ్మద్ ఫయాజుల్లా, ముజాసిమ్ అహ్మద్ భాతీ అనే వారి పేరు మీద ఉంది. వారిద్దరూ ఏఎంయూ హాస్టల్ మెస్ సీనియర్ సభ్యులు.
బీఫ్ బిర్యానీకి సంబంధించిన నోటీసు బైటకు రావడంతోనే సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. విషయం పెద్దదవడంతో అలీగఢ్ పోలీసులు వేగంగా స్పందించారు. మహమ్మద్ ఫయాజుల్లా, ముజాసిమ్ అహ్మద్ భాతీ, డైనింగ్ హాల్ ప్రధాన నిర్వాహకుడు ఎఫ్ఆర్ గౌహర్ అనే ముగ్గురి మీద కేసు రిజిస్టర్ చేసారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ పాండే నిర్ధారించారు.
గోవధ నిషేధానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న చట్టాలు దేశంలోనే కఠినమైనవి. ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1955 ప్రకారం గోవులను వధించడం, విక్రయించడం, గోమాంసాన్ని రవాణా చేయడం నిషేధం. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పదేళ్ళ వరకూ జైలుశిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా విధించే అవకాశముంది. ఆవులూ దూడలను గాయపరిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించి కేసు నమోదు చేయవచ్చు.
గోవధ, బీఫ్ సంబంధిత నేరాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంఘటన తీవ్రమైన చట్టపరమైన, రాజకీయ పరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఎఎంయు ప్రొక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వాసిమ్ అలీ నష్టనివారణకు ప్రయత్నించారు. జరిగిన వ్యవహారం టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసారు. డైనింగ్ హాల్ స్టాఫ్ చికెన్ బిర్యానీ అని రాయబోయి పొరపాటున బీఫ్ బిర్యానీ అని రాసారని సమర్ధించుకోబోయారు. రాష్ట్రంలోని చట్టాలను ఉల్లంఘించే ఉద్దేశం ఎఎంయుకు లేదనీ, మెస్ మెనూను మార్చలేదనీ చెప్పుకొచ్చారు.
అయితే ఆయన సమర్ధనను ఎవరూ విశ్వసించడం లేదు. ‘‘ఎక్కువ మంది అడుగుతున్న కారణంగా ఆదివారం లంచ్ మెనూ మారుస్తున్నాం. చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తాం. హాస్టల్లో ఉండే అత్యధికుల కోరిక ప్రకారం ఈ మార్పు చేస్తున్నాం’’ అని రాసిన నోటీసులో టైపింగ్ తప్పు ఎక్కడుందని నిలదీస్తున్నారు. వర్సిటీ వివరణ విశ్వసనీయంగా లేదని విమర్శకులు వాదిస్తున్నారు. రాష్ట్రంలోని చట్టాలను ఉద్దేశపూర్వకంగా సవాల్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఆ పని చేసారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.