ఉద్యోగుల పని గంటల పెంచాలంటూ పలువురు కార్పొరేట్ పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర స్పష్టం చేసింది. లోక్ సభ వేదికగా ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని సభలో వెల్లడించారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధి మేరకు నిర్వహిస్తాయని తెలిపారు.
చట్టాల అమలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ నిర్వహిస్తోందని, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే పర్యవేక్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
పరిశ్రమల చట్టం 1948, ఆయా రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుల ద్వారా పని గంటలు, అదనపు పనిగంటలపై నిర్ణయం ఉంటుందన్నారు.
ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు మించి పనిచేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించారు. రోజుకు 12 గంటలు, అంతకుమించి కూర్చుని పనిచేసే వారు తీవ్ర నిస్పృహ, మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది.