కేరళ జనాభా ముఖచిత్రం (డెమొగ్రఫీ) చాలా వేగంగా మారిపోతోంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల జనాభా కంటె ఎక్కువగా జననాలు నమోదయ్యాయి. ఈ యేడాది జనవరి 30న ‘సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్’ అనే మేధోసంస్థ ఒక నివేదిక ప్రచురించింది. కేరళ రాష్ట్రంలో మతపరంగా జనసంఖ్యలో వస్తున్న మార్పుల గురించి ఆ నివేదిక అధ్యయనం చేసింది. ‘రెలిజియస్ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా: రైజింగ్ రెలిజియస్ ఇంబ్యాలెన్స్’ ( భారతదేశపు మతపరమైన జనాభా అధ్యయనం: మతాల మధ్య పెరుగుతున్న అసమతౌల్యం) అనే శీర్షిక కలిగిన ఆ నివేదిక కేరళలో వేర్వేరు మతాలకు చెందిన జననాలు, మరణాల రేట్లకు సంబంధించి 2008 నుంచి 2021 వరకూ గల వార్షిక గణాంకాలను విశ్లేషించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
కేరళ జనాభాలో హిందువులు 54శాతం ఉండేవారు. ముస్లిములు వారిని జననాల రేటు విషయంలో 2015 తర్వాత దాటేసారు. 2019లో మొత్తం జననాల్లో ముస్లిముల వాటా 44శాతం నమోదయింది. 2011 జనాభా లెక్కల్లో 27 శాతం ఉన్న ముస్లిం జనాభా కంటె ఈ జననాల శాతం చాలా ఎక్కువ.
అదే సమయంలో 2018 నుంచి 2021 వ్యవధిలో హిందువుల్లోనూ, క్రైస్తవుల్లోనూ జననాల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ముస్లిముల మొత్తం జననాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
2008లో హిందువుల జననాల సంఖ్య 241,305. అంటే జననాల రేటు 45.04శాతం ఉండేది. అదే ఏడాది ముస్లిముల జననాల సంఖ్య 194,583 కాగా క్రైస్తవుల సంఖ్య 94,175. 2009 నాటికి హిందువులు 45.51 శాతానికి పెరిగింది. అదే ముస్లిములలో ఆ సంఖ్య 37.61శాతం, 16.61శాతంగా నమోదయ్యాయి.
ఆ మరుసటి సంవత్సరం 2010లో హిందువుల జననాలు 246,297 (45.03శాతం) కాగా, ముస్లిముల జననాలు 209,276 (38.26శాతం)గా నమోదయ్యాయి. క్రైస్తవుల జననాలు మాత్రం 88,936 (16.26శాతం)కు తగ్గాయి.
2012, 2013లో హిందువులు, ముస్లిముల జననాల్లో గణనీయమైన పెరుగుదల నమోదయింది. క్రైస్తవుల జననాలు మాత్రం తగ్గాయి.
అయితే 2014లో గణనీయమైన మార్పు కనిపించింది. హిందువులు, క్రైస్తవుల జననాలు పడిపోగా, ముస్లిముల జననాలు మాత్రం భారీగా పెరిగాయి. అప్పటినుంచీ ప్రతీయేటా అదే ట్రెండ్ కొనసాగింది. 2015లో హిందువుల జననాలు 221,220 కాగా ముస్లిముల జననాలు 2,13,865కు చేరుకున్నాయి, క్రైస్తవుల జననాలు 79,565కు తగ్గాయి.
2016లో మొదటిసారి ముస్లిముల జననాల సంఖ్య హిందువుల జననాల సంఖ్యను దాటేసింది. ఆ యేడాది 211,182 ముస్లిముల జననాలు నమోదయ్యాయి. హిందువుల జననాలు 207,831కి తగ్గాయి. క్రైస్తవుల జననాలు కూడా 76,205కు పడిపోయాయి.
2017లోవార్షిక జననాల సంఖ్య 5లక్షల మార్కును దాటింది. 2018లో మళ్ళీ ఆ సంఖ్య పతనమైంది. 2019లో హిందువుల జననాలు 197,061కి పతనమయ్యాయి. ముస్లిం జననాలు మాత్రం 212,933గా నమోదయ్యాయి. తర్వాతి ఏళ్ళలో హిందువుల జననాలు మరింత క్షీణించాయి. 2020లో 185,411గానూ, 2021లో 181,396గానూ నమోదయ్యాయి. అదే ముస్లిముల జనసంఖ్య విషయానికి వస్తే 2020లో 196,138 జననాలు నమోదైతే 2021లో ఆ సంఖ్య 169,296కు తగ్గింది. క్రైఎస్తవుల ఇళ్ళల్లో పిల్లల పుట్టుకలు కూడా 62,265కు క్షీణించాయి. 2021 నాటికి ఆ సంఖ్య మరింత తగ్గి 59,766కు చేరుకుంది.
టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) నిర్ణయించడం:
సీపీఎస్ నివేదిక ప్రకారం కేరళలో 2008లో జననాలు 5.36లక్షలు కాగా అవి 2011 నాటికి 5.60 లక్షలకు చేరాయి. అప్పటినుంచీ క్రమంగా పతనమవుతూ వచ్చింది. 2015లో కేరళలో మొత్తం జననాల సంఖ్య 5.16 లక్షలకు తగ్గింది. ఆ సంఖ్య 2020లో 4.46 లక్షలకు, 2021లో 4.20 లక్షలకూ చేరుకుంది. దాన్ని బట్టి కేరళలో సంతాన సామర్థ్యం ఏటికేటా తగ్గుతోందని అర్ధమవుతుంది.
కేరళలో టీఎఫ్ఆర్ విలువ తొంభైల నాటికే రీప్లేస్మెంట్ స్థాయి అయిన 2.1 కంటె దిగువకు క్షీణించింది. ఆ విషయాన్ని 1992-93 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మొదటి రౌండ్లోనే తేలిపోయింది. టీఎఫ్ఆర్ విలువ 2021 నాటికి 1.46కు పతనమైంది. అలా మూడు దశాబ్దాలకు పైబడిన కాలం నుంచి టోటల్ ఫెర్టిలిటీ రేటు విలువ రీప్లేస్మెంట్ స్థాయుల కంటె తక్కువగా ఉంటూ వచ్చింది. అంటే జననాల రేటు, తద్వారా రాష్ట్ర జనాభా గణనీయంగా తగ్గుతోందని అర్ధం.
మొత్తం శిశు జననాల్లో ముస్లిముల వాటా 2008 నుంచి నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. మొదటి నాలుగేళ్ళలో అంటే 2011 వరకూ ముస్లిముల జననాలు నెమ్మదిగానే పెరుగుతూ వచ్చాయిజ కానీ 2011 నుంచి నేటివరకూ ముస్లిముల జననాలు భారీ వేగం పుంజుకున్నాయి. 2015 నాటికి పరిస్థితి ఎలా తయారైందంటే హిందువుల జననాల కంటె ముస్లిముల జననాలే ఎక్కువగా నమోదయ్యాయి. అది గుర్తించదగిన పరిణామం. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో ముస్లిముల జననాల సంఖ్య మొత్తం కేరళలో పుట్టిన జనాభా కంటె కొంచెమే తక్కువగా నమోదయింది.
డెమొగ్రాఫిక్ మార్పు:
2008 నుంచి 2019 వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేరళలో ముస్లిముల జననాల సంఖ్య పెరుగుతూ పోతుండగా, మరోవైపు హిందువులు, క్రైస్తవుల జననాలు సంఖ్య కుంచించుకుపోయింది. అంటే కేరళలో ఆ వ్యవధిలో కూడా జనాభా ముఖచిత్రం (డెమొగ్రాఫికల్ ఛేంజ్) మారుతూనే వచ్చింది. అంతకుముందు 36.3శాతం నుంచి 44.4 శాతానికి ముస్లిముల జనసంఖ్య పెరిగింది. అదే సమయంలో హిందువుల జనాభా 45శాతం నుంచి 41శాతానికి పడిపోయింది. ఇంక క్రైస్తవుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారి జనసంఖ్య 17.6శాతం నుంచి 14.3కు పతనమైంది.
2011 నాటికి కేరళలో ముస్లిముల జనాభా మొత్తం జనాభాలో 26.6శాతం ఉండేది. కానీ 2019లో వారి జనాభా 44.4శాతానికి పెరిగింది. మరోవైపు, మొత్తం జనాభాలో 54.7శాతం ఉన్న హిందూ జననాలు 41.0కు తగ్గాయి. క్రైస్తవుల్లో జననాల శాతం 18.4 నుంచి 14.3 పడిపోయింది. మరోలా చెప్పుకోవాలంటే కేరళలోని మొత్తం జననాల్లో ముస్లిముల జననాల వాటా, కేరళ జనాభాలో ముస్లిముల జనాభా కంటె 2/3వంతులు ఎక్కువ. కానీ హిందువులు, క్రైస్తవుల్లో వారి జననాల వాటా వారివారి జనాభా కంటె 1/4వంతు తక్కువ.
1951 నుంచీ హిందువులు, క్రైస్తవులతో పోలిస్తే ముస్లిముల జననాల సంఖ్య ఎప్పుడూ వేగంగానే పెరుగుతోంది. ఇక ఆ రెండు వర్గాల మధ్య దూరమూ గణనీయంగా పెరుగుతోంది. దాని ఫలితంగా 2001 నుంచీ రాష్ట్రంలో ముస్లిముల వాటా 1.84 పెర్సెంటేజ్ పాయింట్స్ పెరిగింది. హిందువులు, క్రైస్తవుల వాటా వరుసగా 1.44, 0.64 పెర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది.
జననాల రేటు పెరుగుదలకు కారణం టోటల్ ఫెర్టిలిటీ రేటే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గత నాలుగు నివేదికలను పరిశీలిస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ హిందువులలో కంటె ముస్లిములలో సుమారు 50శాతం ఎక్కువ ఉంది.
కేరళలో ముస్లిముల ప్రాబల్యం:
భారతదేశంలో ముస్లిములు, మొగలు సామ్రాజ్యం కంటె ముందునుంచే ఉన్నారు. పూర్వ సామాన్య శకం 4వ శతాబ్దం నాటికే ముస్లిములు భారత్‌కు వచ్చారు. అప్పట్లో అరబ్బు వ్యాపారులు సుగంధద్రవ్యాల కోసం భారత్ వచ్చారు. కేరళ అప్పటికే సుగంధద్రవ్యాల కేంద్రంగా ఉండేది. అందువల్ల అరబ్బు దేశాల వ్యాపారులకు కేరళ ప్రాంతమే ప్రధాన ఆకర్షణగా ఉండేది.
అరబ్బు వ్యాపారులు తమ వ్యాపారం మాత్రమే చూసుకోలేదు. వారు స్థానిక ప్రజలతో కలిసిపోయారు. క్రమంగా సిరియన్ ముస్లిములు, అరబ్బు దేశాల వర్తకులూ కేరళ నుంచి మిగతా భారతదేశం అంతటికీ వ్యాపించారు. ఆ సమయంలోనే వారు ఇక్కడ స్థిరపడాలని భావించారు. ఆ విధంగా దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో ముస్లిములు పెద్దసంఖ్యలో ఉనికి సంపాదించుకున్నారు.
అరబ్బు వ్యాపారవేత్తలు ఇక్కడి భారతీయ మహిళలను పెండ్లాడారు, కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. కేరళలో ముస్లిములు ఎక్కువగా ఉండే ఉత్తరభాగంలో వారిని మాప్పిళ్ళా (అల్లుడు) అని పిలుస్తారు. దక్షిణాసియాలో అత్యంత ప్రాచీనమైన మతమార్పిడులు అప్పుడు జరిగినవే.
14వ శతాబ్దంలో మొరాకో పర్యాటకుడు ఇబన్ బతూతా కేరళను సందర్శించినప్పుడు కేరళలో ఇస్లాం ఉనికి మరింత స్థాపితమైంది. ఆ వ్యాపారులు అరబ్ దేశాలకు రాకపోకలు సాగించారు, తద్వారా సాంస్కృతిక, ప్రాంతీయ ఏకరూపత మొదలైంది. ఏదేమైనా ఇస్లాం ప్రభావం బలీయంగా ముద్రించుకుపోయింది మాత్రం మొగలుల ఆక్రమణల తర్వాతే అని చెప్పవచ్చు.
కేరళలో మొదటి మసీదు సామాన్య శకం 699లో నిర్మించారు. మాలిక్ బిన్ దినార్ అనేవాడు కేరళలోని త్రిశూరులో చేరమాన్ జంప్ మసీదును నిర్మించాడు. అదే కేరళలో మొట్టమొదటి మసీదు. మాలిక్ బిన్ దినార్ అనేవాడు కొండగల్లూరు చేరమాన్ పెరుమాళ్‌కు సమకాలికుడు. చేరమాన్ మక్కాకు వెళ్ళివచ్చాడు, ఆ తర్వాత ఇస్లాంలోకి మారిపోయాడు. ఆ పెరుమాళే మక్కా నుంచి భారతదేశానికి ముస్లిములను ఆహ్వానించాడు, ఇక్కడ ఇస్లాం బోధనలను ప్రచారం చేయాలని కోరాడు.