అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి 5 వేల మందిని పలు దేశాలకు తరలించారు. తాజాగా భారత్కు చెందిన 380 మందిని సైనిక విమానంలో తరలించారు. కాసేపట్లో అక్రమ వలసదారులతో కూడిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగనుంది.
అమెరికాలో పలు దేశాలకు చెందిన 60 లక్షల మంది అక్రమంగా నివాసం ఉంటున్నట్లు అంచనా. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరవాత వలసదారుల ఏరివేత మొదలైంది. భారత్ నుంచి 7 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులు ఉంటారని తెలుస్తోంది. అయితే 18 వేల మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు భారత్ గుర్తించింది. తిరిగి భారత్కు రావాలని విదేశాంగశాఖ సూచించింది.
అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అక్రమ వలసలు నేరాలకు దారితీస్తున్నాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికాలో సాల్వేడార్ తరవాత అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులదే అగ్రస్థానంగా ఉంది. ఇప్పటికే మెక్సికో, సాల్వెడార్, గ్వాటెమాలా దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించారు. ఇందుకు అమెరికా ఒక్కో వలసదారుడిపై 5 వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.
మెక్సికో, కెనడాలపై అమెరికా అధ్యక్షుడు ఇటీవల పెంచిన 25 శాతం సుంకాలను నెల రోజుల పాటు నిలిపివేశారు. చైనాపై 10 శాతం పెంపు అమల్లోకి వచ్చింది. సుంకాల పెంపుపై కెనడా తీవ్రంగా స్పందించడంతో అమెరికా ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది.