ఓ వాహనం అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా కు చెందిన 14 మంది వివాహ వేడుకకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి హర్యానాకు చెందిన 14 మంది పంజాబ్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి స్వస్థలానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కాలువలో పడింది.స్థానికులు ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.మిగతా ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. శనివారం ఉదయం సంఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలు వెలికితీశారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, పదేళ్ల బాలిక ఉన్నారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.