అస్సాం గౌహతి పట్టణంలోని గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక మీద ఆస్పత్రి ఉద్యోగి ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తిని నేరం చేయడంలో ఒక మహిళ సహకరించడం గమనార్హం. ఆస్పత్రిలో క్లీనింగ్ స్టాఫ్ అయిన అబ్దుల్ రషీద్. అతని మిత్రురాలు కరాబీ రాయ్ ఈ కేసులో నిందితులు. వారిని ఆస్పత్రి సిబ్బంది బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసారు.
13ఏళ్ళ బాధిత బాలిక తల్లి జరిగిన సంఘటన గురించి భాంగాగఢ్ పీఎస్‌లో జనవరి 21న ఫిర్యాదు చేసారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ వార్డ్‌లో బాలికపై లైంగిక దాడి జరిగిందని బాలిక తల్లి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు తీసుకున్నాక పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు. అబ్దుల్ రషీద్, కరాబీ రాయ్‌లను అరెస్ట్ చేసారు. వారిని రిమాండ్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
బాధితురాలికి తగిన వైద్యం అందజేస్తున్నారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసారు. భౌతిక, సాంకేతిక సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు కోసం పంపించారు. జిఎంసిఎచ్ అధికారులు చెప్పిన ప్రకారం అబ్దుల్ రషీద్ ఆస్పత్రి పే-రోల్స్‌లో లేడు. అతనొక ఔట్‌సోర్స్‌డ్ ఉద్యోగి. అంతేకాదు, బాధిత బాలికకు అతను సుమారు ఏడాది నుంచీ పరస్పరం తెలుసు. కాబట్టి ఈ కేసును లైంగిక వేధింపులు లేక రేప్ కేసుగా నిర్ణయించడం కష్టం అంటున్నారు.