సనాతన ధర్మానికి అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉందని, దేశపు అస్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సనాతన ధర్మానిది కీలక పాత్ర అని జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజర్ ఆసిఫ్ అన్నారు. ‘మీ అంతరాత్మను శుద్ధి చేసుకోండి’ అనే కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ జన్మించిన వారణాసి లామాహీ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన మజర్ ఆసిఫ్, శివదేవుడి వారసత్వంలోనూ, సనాతన ధర్మంలోనూ నిక్షిప్తమై ఉన్న నైతిక విలువలు, ఐకమత్యం, సర్వమానవ సౌభ్రాతృత్వం వంటి విలువలను భారతీయులు అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
పరమేశ్వరుడి నివాస స్థానమైన కాశీలోని సంస్కృతి హిందూధర్మపు నిజమైన సారాంశాన్ని ప్రతిబింబిస్తుందంటూ ప్రొఫెసర్ ఆసిఫ్ తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. కాశీలో వెల్లివిరిసిన సనాతన ధర్మం భారతదేశపు సమ్మిళిత, సమీకృత తత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు. ‘‘శివ భగవానుడి క్షేత్రంలో ఆవిర్భవించిన నిజమైన హిందూ సంస్కృతి భారతీయ సంస్కృతికి పునాది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సమైక్యత, సౌభ్రాతృత్వాలకు మార్గదర్శకంగా నిలిచిన వెలుగుదివ్వె. ఆ విలువలు మన దేశ సరిహద్దులను దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న ఘర్షణలు, సవాళ్ళకు ఈ విలువలు పరిష్కారాలను చూపగలవు’’ అని ప్రొఫెసర్ ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఆ సర్వమానవ సౌభ్రాతృత్వపు స్ఫూర్తిని భారతీయులు అందరూ అందుకోవాలని, ఆ స్ఫూర్తిని ప్రపంచమంతటా వ్యాపింపజేయాలనీ, అలా భారతదేశపు నిజమైన రూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనీ పిలుపునిచ్చారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాల నుంచి ప్రేరణ పొందాలని చెబుతూ ప్రొఫెసర్ ఆసిఫ్ ప్రతీ వ్యక్తి జీవితంలోనూ అంతశ్శోధన, నైతిక విలువలతో జీవించడానికి అమిత ప్రాధాన్యం ఉందని నొక్కి వక్కాణించారు. ‘‘తమ అంతరాత్మను శుద్ధి చేసుకునేందుకు ప్రతీ ఒక్కరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం గొప్ప పాఠం. ప్రాణం ఉన్న, లేని ఏ పదార్ధానికైనా హాని తలపెట్టకుండా ఉండేవాడే గొప్ప హిందువు’’ అని వింవరించారు. ‘‘మీరు మీ వాహనాన్ని నిషిద్ధ ప్రాంతంలో పార్క్ చేసినా, మీ పొరుగువారిని ఇబ్బంది పెట్టినా, చెత్త పారవేసి పర్యావరణాన్ని కలుషితం చేసినా మీరు హిందువు కాదు. హిందూ ధర్మం అనేది కేవలం ఒక మతం కాదు. ప్రతీ వ్యక్తీ క్రమశిక్షణ, తోటివారి పట్ల గౌరవం, మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల బాధ్యత కలిగి ఉండాలని కోరుకునే జీవనమార్గమే హిందుత్వం’’ అని మజర్ ఆసిఫ్ చెప్పారు.
‘‘ఇస్లాం, క్రైస్తవం వంటి మిగతా అన్ని మతాలూ తామే గొప్పవని చెప్పుకుంటాయి. కానీ మీ చుట్టూ చూడండి. ఆ మతాల పేరిట మానవాళి ప్రతీరోజూ భయంకరమైన ఊచకోతలను అనుభవిస్తోంది. అయితే భారతీయ సంస్కృతి వాటికి విరుద్ధం. అయితే భారతీయ సంస్కృతి ఒక విభిన్నమైన దారిని అందించింది. ఆ సంస్కృతి మనకు కలిసి నడవాలని, భిన్నత్వాన్ని ఆదరించాలని, సమన్వయాన్ని పాటించాలనీ బోధించింది’’ అని చెప్పారు.
ఆధునిక సమాజంలోని మోసపూరిత విధానాలను వైస్‌ఛాన్సలర్ ఎండగట్టారు. ‘‘ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మోసపూరితంగా మారుతున్నారు. మరోవైపు ఆధునిక ప్రపంచపు సంక్లిష్టతలు సోకని గ్రామీణ ప్రజలు నిజాయితీ, నిరాడంబరతతో కూడిన జీవితాలను గడుపుతున్నారు. సమకాలీన సమాజంలో చదువుకు, నైతిక ప్రవర్తనకూ ఆమడ దూరం ఉంటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.
భారతీయుల సమైక్యత, దేశభక్తి భావాలకు అసాధారణ ప్రతీకలుగా కాశీలోని భారతమాత మందిరం, సుభాష్ చంద్రబోస్ మందిరం నిలుస్తాయంటూ ప్రొఫెసర్ ఆసిఫ్ కాశీ నగరపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఆ గుడులకు ప్రపంచంలో దేనితోనూ పోలిక లేదు. దేశం పట్ల భక్తి, దాని సాంస్కృతిక మూలాలపై గౌరవం భారతీయమైన అస్తిత్వానికి చిహ్నాలు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ఇవాళ ప్రేమను తరచుగా ద్వేషం కమ్మేస్తోంది. విలువలకూ ఆచరణకూ సంబంధం ఉండడం లేదు. మన చేతలూ, మన ఆలోచనలూ ఐకమత్యంగా ఉండడం ఇప్పుడు మనకు కావాలి. అప్పుడే సమాజం నిజమైన ప్రగతిని సాధిస్తుంది’’ అంటూ ప్రొఫెసర్ మజర్ ఆసిఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.