ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల అణచివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కోబ్రా బెటాలియన్203, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు 203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్‌కు చెందిన ఏ,డీ కంపెనీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
మెటగూడెం గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ గుహను భద్రతా బలగాలు కనిపెట్టాయి. అందులో ప్యాక్ చేసిన 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, జనరేటర్ సెట్, లాత్ మెషిన్, భారీ పరిమాణంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామగ్రి ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత జయరాంరెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. చలపతి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు పలు దాడులకు పాల్పడినట్లు కేసులు నమోదు అయ్యాయి.