ఒడిషా జాజ్‌పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు ఒడిషాలో బౌద్ధానికి కేంద్రస్థానంగా రత్నగిరికి ఉన్న ప్రాముఖ్యతను నిలబెట్టాయి.
ఎఎస్ఐ కనుగొన్నవాటిలో ఒక బౌద్ధ విహారం, బుద్ధుడి రాతి బొమ్మలు, స్తూపాలు, రాతి చెక్కడాలు, కుండలు, పూసలు, రాతి స్తంభాలు, ఒక ఇటుకల గోడ ఉన్నాయి. దాన్నిబట్టి అక్కడ ఒక పెద్ద నిర్మాణం ఉండేదని అర్ధమైంది. ఏకశిలలో చెక్కిన 5అడుగుల పొడవు, 3.5అడుగుల ఎత్తు ఉన్న ఏనుగు బొమ్మ మరో ప్రధానమైన ఆవిష్కరణ. విరిగిపోయి ఉన్నా, ఆ ఏనుగు బొమ్మ చాలావరకూ ఆకట్టుకునేలాగే ఉంది. ఒడిషాలో దొరికిన అటువంటి శిల్పాల్లో అదే పెద్దది.
రత్నగిరిలో ఎఎస్ఐ 2024 డిసెంబర్‌లో తవ్వకాలు ప్రారంభించింది. సంస్థ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రజ్ఞాపతి ప్రధాన్ ఆధ్వర్యంలో గువాహటి, అస్సాం, సంబల్‌పూర్, ఉత్కళ్ విశ్వవిద్యాలయాల విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎస్ఐ పూరీ సర్కిల్ సూపరింటెండెంట్ దిబాశిష్ గడ్‌నాయక్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. ఒడిషాల బౌద్ధం చూపిన సాంస్కృతిక ప్రభావం, దాని చరిత్ర గురించి కొత్త విషయాలు చెప్పే కళాఖండాలను కనుగొనడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ తవ్వకాల్లో ప్రధానంగా లభించినవి బుద్ధుడి భారీ శిరస్సు ఒకటి, బౌద్ధదేవతల శిథిల శిల్పాలు, ఏకశిలలో చెక్కిన స్తూపాలు. ఆ కాలం నాటి కళాత్మక, నిర్మాణాత్మక నైపుణ్యాలను ప్రతిబింబిస్తున్న ఆ కళాఖండాలు రత్నగిరి చారిత్రక ప్రాధాన్యతకు సాక్ష్యాలుగా నిలిచాయి.
భారతదేశంలో ముస్లిముల దురాక్రమణల కారణంగా సామాన్యశకం 13వ శతాబ్దం నుంచీ రత్నగిరి ప్రాంతపు పతనం ప్రారంభమైంది. అయితే అక్కడ లభించిన కొన్ని అవశేషాలను బట్టి అక్కడ 16వ శతాబ్దం వరకూ కొన్ని పనులు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. తాజా తవ్వకాలు ఒడిషాలో బౌద్ధం పరిణామక్రమాన్ని, ఆగ్నేయాసియాతో బౌద్ధం సంబంధాలనూ అర్ధం చేసుకోడానికి ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
అయితే స్థానికంగా భూముల దురాక్రమణల వల్ల పురావస్తు తవ్వకాలకు సవాళ్ళు ఎదురయ్యాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని పలు భాగాల్లో చాలామంది గ్రామస్తులు ఇళ్ళు కట్టేసుకున్నారు. దానివల్ల తవ్వకం, పరిరక్షణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. బౌద్ధ సంబంధిత కళలు, నిర్మాణాలు అమూల్యమైన నిధి అనీ, వాటిని పరిరక్షించుకోడానికి ప్రభుత్వం జోక్యం తక్షణమే జోక్యం చేసుకోవాలనీ పురావస్తు, చరిత్ర అభిమానులు కోరుతున్నారు.
రత్నగిరిలో బైటపడిన బౌద్ధారామం సామాన్య శకం 8వ శతాబ్దానికి చెందినది అని ఒడిషా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మారిటైం అండ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ స్టడీస్ విభాగం కార్యదర్శి డాక్టర్ సునీల్ పట్నాయక్ వెల్లడించారు. భౌమాకర వంశం పాలనలో రత్నగిరి 8నుంచి 11వ శతాబ్దం వరకూ ప్రముఖ బౌద్ధక్షేత్రంగా రాజభోగం అనుభవించింది. ఇక్కడ కనుగొన్న బౌద్ధ విగ్రహాలు ప్రత్యేకమైనవి. వాటి నిర్మాణరీతి కానీ, తలకట్టుల్లో సున్నితమైన తేడాలు కానీ భారతదేశంలో మరెక్కడా కనిపించవు.
రత్నగిరి వివరాలను మొదటిసారి 1905లో అప్పటి జాజ్‌పూర్ జిల్లా సబ్ డివిజనల్ ఆఫీసర్ మన్మోహన్ చక్రవర్తి డాక్యుమెంట్ చేసారు. 1958 నుంచి 1961 వరకూ చేసిన తొలి దశ తవ్వకాల్లో ప్రముఖ పురావస్తు నిపుణుడు డా. దేబల మిత్రా ఎన్నో విలువైన వస్తువులను వెలికితీసారు. వాటిలో ఇటుకలతో చేసిన భారీ స్తూపం, మూడు బౌద్ధ విహారాలు, ఎనిమిది దేవాలయాలు, 700కు పైగా మొక్కుల స్తూపాలూ లభించాయి. అందుకే రత్నగిరిని మిత్రా ఏకంగా నలందా విశ్వవిద్యాలయంతో పోల్చారు. పైగా ఆ ప్రదేశంలో 5వ శతాబ్ది నుంచి 12వ శతాబ్ది వరకూ నిర్మాణాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి.