మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు వాషింగ్టన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో మొదలుపెడతామని వెల్లడించారు.
‘‘ఇకపై ఎవరూ తెరచి ఉన్న సరిహద్దులు, జైళ్ళు, మానసిక చికిత్సాలయాలను చూడరు. పురుషులు మహిళల క్రీడలు ఆడడం, ప్రతీదానిలోనూ ట్రాన్స్‌జెండర్లు అలాంటి పరిస్థితులను చూడరు. త్వరలోనే మేము అమెరికా చరిత్రలో అతిపెద్ద డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ – మగా’ పేరుతో నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతామని, మధ్యప్రాచ్యంలో అల్లకల్లోల పరిస్థితులను రూపుమాపుతామని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తామనీ, అమెరికాలో ఇమిగ్రేషన్ సంక్షోభాన్ని నివారిస్తామనీ ట్రంప్ చెప్పుకొచ్చారు.
అమెరికాలోని ప్రస్తుత రాజకీయ వ్యవస్థ నిర్మాణాన్ని కూలదోసి తీరతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. విఫలమైన, అవినీతి రాజకీయ ప్రక్షాళన చేస్తానని ట్రంప్ హామీ చేసారు. చైనీస్ యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో వాడడానికి అనుమతిస్తామని, అయితే ఆ సంస్థలో 50శాతం వాటాలు అమెరికాకు ఇవ్వాలన్నారు. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలు, కమ్యూనిస్టు చైనాకు వ్యాపారమూ పోకుండా రక్షిస్తామని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రమాణస్వీకార వేడుకలు జనవరి 18నే మొదలైపోయాయి. మొదట వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో కుటుంబసభ్యులు, మిత్రులు వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దాని తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్ జరుగుతుంది. చివరిగా జనవరి 20న అధికారికంగా ప్రమాణస్వీకారం చేస్తారు.