భారత నావికాదళం రోజురోజుకు మరింత బలోపేతం అవుతోంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యసాధనలో భారత్ కీలక ముందడుగు వేసింది. ప్రధాని మోదీ, నేడు ముంబై లో మూడు యుద్ధ నౌకలను జాతికి అంకిత మిచ్చారు.
ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ ను ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.
యుద్ధ నౌకలు వాటి విశేషాలు..
ఐఎన్‌ఎస్ సూరత్: పీ15B గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద ఈ నౌకను అభివృద్ధి చేశారు. ఈ శ్రేణిలో తయారు చేసిన నాలుగో యుద్దనౌక కావడం మరో విశేషం.ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్‌షిప్‌లలో ఇది ప్రధానమైనది. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయగా అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ నీలగిరి: పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ నౌకను తయారు చేశారు. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనిని రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్: పీ75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి వాఘ్ షీర్. దీని తయారీలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది.