దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విడిపించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ జనవరి 5న విజయవాడ శివార్లలోని కేసరపల్లి దగ్గర ‘హైందవ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన వివరాలను విశ్వహిందూ పరిషత్ బాధ్యులు ఇవాళ పాత్రికేయులకు తెలియజేసారు.
హైందవ శంఖారావం సభాధ్యక్షులు, విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ‘‘హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనడానికి సుమారు 4వేల బస్సులు, 7 రైళ్ళలో హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో వస్తున్నారు. ఇప్పటికే వేలాది కార్యకర్తలు సభ ఏర్పాట్ల పనుల్లో ఉన్నారు. ఈ ఉద్యమం కేవలం ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కాదు. విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇతర మతాలకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండాలి. దేవాలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. దానికోసం దేవాలయాల నిర్వహణ పూర్తిగా హిందువుల చేతిలో ఉండాలి. ఆ డిమాండ్‌ను ముందుకు తీసుకు వెళ్ళడానికి సభను నిర్వహిస్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. పెద్దసంఖ్యలో హిందూ బంధువులు ఆ సభకు హాజరు కావాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం మాట్లాడుతూ ‘‘దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ధార్మిక మండలికి అప్పగించాలి. ఆ డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతోంది. ఆ మేరకు ఒక ముసాయిదాను రూపొందించి, దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు 2024 సెప్టెంబర్ 30న అందజేసాం. చర్చిలు, మసీదుల మీద ప్రభుత్వ నియంత్రణ లేదు. అలాగే దేవాలయాల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. ఆలయాల నిర్వహణ బాధ్యతలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థకు అప్పగించాలి అని కోరుతూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకూ విజ్ఞాపన పత్రాలు సమర్పించాం. అలాంటి జాతీయ ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 5న హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అందులో విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్, శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవిందదేవ్‌గిరి మహరాజ్, విశ్వహిందూ పరిషత్ సంఘటన మహామంత్రి మిలింద్ పరాండే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాధుసంతులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల నుంచీ లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు. మా డిమాండ్ ఒకటే. మందిరాల నిర్వహణను ధార్మిక మండలికి అప్పగించాలి. దానికోసం దేశంలోని గొప్ప పండితులు, న్యాయమూర్తులు, మహంతులు తదితరుల సలహా సూచనలతో విశ్వహిందూ పరిషత్ ఒక ముసాయిదా తయారుచేసింది. గతనెల మా గోకరాజు గంగరాజు గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ ముసాయిదా ప్రతిని అందజేసాం. అదే విషయం మీద జాతీయ ఉద్యమం రూపకల్పన చేస్తున్నాం. దానిలో భాగంగా ‘హైందవ శంఖారావం’ పేరుతో జనవరి 5న భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నాం. దేవాలయాల నిర్వహణ ధార్మిక మండలికి అప్పగించడం, ఆలయాల నిర్వహణ నుంచి అన్యమతస్తులను తొలగించడం, పూజాదికాలకు చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఆలయ పాలక మండళ్ళలో రాజకీయ నాయకులకు స్థానం కల్పించకుండా ఉండడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడానికి ఈ జనసభ ఏర్పాటు చేసాం’’ అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కోశాధ్యక్షులు, హైందవ శంఖారావం కోశాధ్యక్షులు దుర్గాప్రసాదరాజు మాట్లాడుతూ ‘‘30 ఎకరాల్లో సభా ప్రాంగణం, 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ వచ్చేవారికి నాలుగు దారులు ఏర్పాటు చేసాము. ఆ నాలుగు దారుల్లోనూ పార్కింగ్ ఏర్పాట్లు చేసాము. అక్కణ్ణుంచి సభా ప్రాంగణానికి చేరుకునే దారిలో అన్న ప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేసాము. ప్రతీ ప్రాంగణంలోనూ 30 కౌంటర్లలో సుమారు 50వేల మందికి భోజన సదుపాయం అందుబాటులో ఉంటుంది. సభా ప్రాంగణాన్ని 50 గ్యాలరీలుగా విభజించాం, ప్రతీచోటా ప్రబంధకులు అందుబాటులో ఉంటారు. మొత్తం 3500 మంది ప్రబంధకులు ఉంటారు. అలాగే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి అన్ని సహాయ సహకారాలూ అందిస్తున్నారు. సుమారు 3వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందురోజు రాత్రి వచ్చే దూరప్రాంతాల వారికి ఉప్పులూరు రైల్వేస్టేషన్ దగ్గర వసతి కల్పిస్తున్నాము. సుమారు 50వేల మందికి కాలకృత్యాలు తీర్చుకోడానికి, అల్పాహారం చేసి వేదిక వద్దకు రావడానికీ ఏర్పాట్లు చేస్తున్నాము. రాష్ట్రంలోని 650 మండలాలు, 13వేల గ్రామాలు, అన్ని పట్టణాలు, నగరాల నుంచి వచ్చే హిందూ బంధువులు అందరికీ ఏర్పాట్లు చేస్తున్నాము’’ అని వివరించారు.