ఉత్తర భారతాన్ని మంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కారణంగా జీరో విజిబిలిటీ నమోదైంది. కనీసం మీటరు దూరం కూడా కనిపించడం లేదు. దీంతో పాలెం అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. ఢిల్లీలో ఇవాళ ఉదయం 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంది.
ఢిల్లీలో పొగమంచుకు తోడు చిరు జల్లులు కురుస్తున్నాయి. కాలుష్య ఇండెక్స్ 309 నమోదైంది. జనజీవనం చలికి వణికిపోతోంది. రవాణా స్తంభించింది. జాతీయ రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ఉదయం 10 గంటల వరకు రోడ్లు కనిపించడం లేదు. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రాబోయే వారం రోజులు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 8 వరకు పొగ మంచు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దని సూచించారు. చలిని తట్టుకునేలా దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.