బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను, దేవాలయాల విధ్వంసాన్నీ ఆపాలని కోరిన పాపానికి అరెస్ట్ అయిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జోతె’ అధికార ప్రతినిధి అయిన చిన్మయ్ కృష్ణదాస్‌ను స్థానిక పోలీసులు దేశద్రోహం నేరం ఆరోపించి అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
ఇస్కాన్ సంస్థలో గతంలో పనిచేసిన చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ విచారణ ఈ ఉదయం జరిగింది. చట్టగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ సైఫుల్ ఇస్లాం, 30 నిమిషాల విచారణతో స్వామీ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ నిరాకరించారు. చిన్మయ్ విచారణ సందర్భంగా కోర్టు దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.
చిన్మయ్ కృష్ణదాస్ తరఫున 11మంది న్యాయవాదుల బృందం కేసు వాదించారని సమాచారం. చిన్మయ్ కృష్ణదాస్ పలు వ్యాధులతో బాధపడుతున్నారని, మధుమేహం, శ్వాస సమస్యలతో అవస్థ పడుతున్నారనీ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఆయన మీద తప్పుడు కేసు బలవంతంగా రుద్దుతున్నారని న్యాయవాదుల బృందం ఆరోపించింది.
చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ రాకపోవడం విషాదకరం అని ఇస్కాన్ కోల్‌కతా శాఖ ఉపాధ్యక్షుడు రాధారమణదాస్ వ్యాఖ్యానించారు. ఆయనకు న్యాయం జరిగేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ‘‘చిన్మయ్ కృష్ణదాస్‌కు కొత్త సంవత్సరంలోనైనా స్వేచ్ఛ లభిస్తుందని ఆశించాం… కానీ 42 రోజుల తర్వాత కూడా అతని బెయిల్ తిరస్కరణకు గురయ్యింది. అతనికి న్యాయం జరిగేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.
చిన్మయ్ కృష్ణదాస్ నవంబర్ 25న ఢాకాలోని హజరత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 11న చట్టోగ్రామ్ కోర్ట్ ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.