దేవాలయాల భూములకు ధర్మకర్తగా ఉన్న హోదాను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. దేవాలయాలకు, వాటి ఆస్తులకు రాష్ట్రప్రభుత్వం యజమాని కాదని, కేవలం ధర్మకర్త మాత్రమేననీ న్యాయస్థానాలు సైతం నిర్ధారించిన సంగతిని గుర్తు చేసింది. 1987నాటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ దేవాలయాల ఆస్తులను చట్టవిరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులుగా మార్చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించింది. తాజాగా, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాలయాల భూములను వాడుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై మండిపడింది.
‘‘సంపదను సృష్టించడం కంటె, సంపదను దోచుకోడంలో, ప్రత్యేకించి హిందూ ధార్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేవాలయ భూముల్లో సోలార్ ప్యానెళ్ళను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు ఆ భూములను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించేసి, వాటిని ఏదో ఒక వంకతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసుకోడానికి ఎంతో కాలం పట్టదు. ఇదే కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ భూములు, చర్చ్‌ల భూముల విషయంలో మాత్రం మౌనంగా ఉంటారు. హిందువులను ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకునే ఇలాంటి చర్యలను తక్షణం నిలిపివేయాలి. సోలార్ ప్లాంట్ల ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి’’ అని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేసారు.
దేవాలయ భూముల ఆక్రమణల గురించి విశ్వహిందూ పరిషత్ పలు ఉదాహరణలను ఉటంకించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం వేల యెకరాల దేవాలయ భూములను మింగేసిన సంగతిని గుర్తు చేసింది. లౌకికవాద ప్రభుత్వాలు ఆలయ భూముల పరిరక్షణను నిర్లక్ష్యం చేసాయనీ, వాటిని వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నాయనీ మండిపడింది. వేములవాడలో భక్తులు దానం చేసిన గోశాలను ప్రభుత్వం నిర్వహించలేక చేతులెత్తేసిన సంగతిని గుర్తు చేసింది.
దేవాలయాల ఆదాయంపై 15శాతం పన్ను విధించారు, కానీ దేవాలయాల పరిరక్షణకు బడ్జెట్లో కనీసం కేటాయింపులైనా చేయలేదు అంటూ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఆలయ భూముల ఆక్రమణలు, మందిరాల్లో మూర్తుల విధ్వంసాల సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం తక్షణ కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చింది.
విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఆ రాష్ట్రప్రభుత్వానికి కొన్ని డిమాండ్లతో ఒక ప్రకటన విడుదల చేసింది.
— దేవాలయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలి
— రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
— జస్టిస్ ఎ వెంకట్రామిరెడ్డి కమిషన్ నివేదికను ప్రచురించి, బహిర్గతం చేయాలి
— దురాక్రమణలకు గురైన ఆలయ భూములన్నిటినీ విముక్తం చేయాలి
— ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల నియంత్రణలో ఉన్న దేవాలయాల భూములను విముక్తం చేయాలి
— దేవాలయ భూముల్లో అనధికారికంగా నిర్మించిన హైందవేతర నిర్మాణాలను తొలగించాలి
ఈ అంశాలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలూ చేపడతామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.