స్పేస్ డాకింగ్ చేయడంలో ఇస్రోకు సాయపడే రెండు వ్యోమనౌకలు పిఎస్ఎల్వి-సి60 రాకెట్ నుంచి విజయవంతంగా విడివడి నిర్దేశిత లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరుకున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది.
‘‘స్పేడెక్స్ వ్యోమనౌకకు సంబంధించినంత వరకూ పిఎస్ఎల్వి సి60 మిషన్ పరిపూర్ణమయింది’’ అని మిషన్ డైరెక్టర్ ఎం జయకుమార్ వెల్లడించారు.
2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఇస్రో ప్రణాళికలకు ముందడుగుగా పిఎస్ఎల్వి సి60 ప్రయోగాన్ని పరిగణించారు. అలాంటి ప్రయోగం విజయవంతం అవడం భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో గొప్ప మేలిమలుపుగా నిలిచిపోతుంది.
44.5 మీటర్ల పొడవైన రాకెట్, ఒక్కోటీ 220 కేజీల బరువున్న రెండు వ్యోమనౌకలను తీసుకువెళ్ళి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్ డాకింగ్, శాటిలైట్ సర్వీసింగ్‌తో పాటు వివిధ గ్రహాల మీదకు వెళ్ళడానికి చేసే ప్రయోగాల్లో ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లు ఉపయోగపడతాయి.
ఈ ప్రయోగానికి 25గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభమైంది. మొదట అనుకున్న సమయం కంటె రెండు నిమిషాలు ఆలస్యంగా, సోమవారం రాత్రి 10 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి రాకెట్ నింగికెగసింది.
మొదటి స్పేస్‌క్రాఫ్ట్ ‘ఛేజర్’, రెండవ వ్యోమనౌక ‘టార్గెట్’ రెండూ సమాన వేగంతో సమాన దూరం ప్రయాణించాక 470 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ వద్ద ఆ రెండూ కలిసిపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
డాకింగ్ టెక్నాలజీల్లో నైపుణ్యం సాధించడం ద్వారా ఇస్రో ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ, దాని ప్రయోగాల పరిధి మరింత విస్తారమయ్యాయి.
‘‘చంద్రయాన్-4 మిషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు వంటి ప్రయోగాలకు ఇన్-స్పేస్ డాకింగ్ టెక్నాలజీ’ తప్పనిసరి. కొన్ని మిషన్ల లక్ష్యాలు సాధించడానికి చాలా రాకెట్ లాంచ్‌లు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ టెక్నాలజీ చాలా అవసరమవుతుంది. ఈ ప్రయోగం సాధించడం ద్వారా ప్రపంచంలో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది’’ అని ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెక్నాలజీ ఇప్పటివరకూ చైనా, రష్యా, అమెరికాల దగ్గర మాత్రమే ఉంది.
వ్యోమనౌకలు నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఆ రెండింటి మధ్యా దూరాన్ని తగ్గిస్తూ వాటిని కలిపివేసి (మెర్జింగ్) తద్వారా స్పేస్‌క్రాఫ్ట్ డాకింగ్ పూర్తి చేయడానికి శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇస్రోకు పిఎస్ఎల్వి-సి60 ప్రయోగం ఈ యేడాదిలో ఆఖరి ప్రయోగం. దీనిలో మరో విశేషం ఏంటంటే సి60 రాకెట్, శ్రీహరికోట సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీలో – నాలుగవ స్థాయి వరకూ ఇంటిగ్రేట్ చేసిన మొట్టమొదటి రాకెట్ ఈ సి60యే.