విజయవాడలో రెండోరోజు కొనసాగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
తెలుగులో న్యాయపాలన జరపడం అంత సులభం కాదని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తీర్పుల్లో రాసేందుకు ప్రత్యేక పదాలు అవసరమని వాటిని నిఘంటువులు చూసి రాయాల్సిన అవసరం ఉందన్నారు.
విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల రెండో రోజు కార్యక్రమంలో ‘తెలుగు లో న్యాయపాలన’ అనే అంశంపై సదస్సు నిర్వహించగా పలువురు న్యాయనిపుణులు, భాషా కోవిదులు పాల్గొని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
బ్రిటిష్ హయాంలో తెలుగులో, నిజాం కాలంలో ఉర్దూలో న్యాయమూర్తులు తీర్పులు చెప్పారని గుర్తుచేసిన మండలి బుద్ధప్రసాద్, కొన్ని తెలుగు తీర్పులను హైదరాబాద్‌లో ప్రదర్శనకు పెట్టారని చెప్పారు. తెలుగులో న్యాయపాలన జరపాలని 1974లోనే కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. కృష్ణా జిల్లాలో బ్రిటిష్ వారి హయాంలో అప్పటి న్యాయమూర్తి సీపీ బ్రౌన్ తెలుగు నేర్చుకుని తీర్పులన్నీ తెలుగులో చెప్పారని గుర్తుచేశారు. హైకోర్టులో పూర్తిగా తెలుగులో న్యాయపాలన ఊహించలేమని అభిప్రాయపడ్డారు.ఇటీవల కాలంలో హైకోర్టులో తెలుగు భాషలో పలు తీర్పులనివ్వడం అభినందనీయమన్నారు.
తెలుగు మాధ్యమంలో చదివితే ఉన్నతమైన ఉద్యోగాలు రావని భయపడాల్సిన అవసరం లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు. ‘తెలుగులో న్యాయపాలన’ అంశంపై మాట్లాడిన వెంకట శేషసాయి …కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని మరో వక్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పిలుపునిచ్చారు. న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్లినా మాతృభాషలోనే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తెలుగు లో తీర్పు చెప్పడం తనకు ఆనందంగా ఉందన్నారు. తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందన్నారు.
తాము తెలుగులో తీర్పు ఇస్తే ఆంగ్లంలో అభినందనలు వచ్చాయని జస్టిస్ భీమపాక నగేశ్ అన్నారు. మాతృభాషలో చదువుకునే హైకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగామన్నారు.
ప్రతీ ఒక్కరూ తెలుగు భాష మాధుర్యం గొప్పదని జస్టిస్ బి. కృష్ణమోహన్ అన్నారు. చిన్నారులకు మన కవులు, వాగ్గేయకారుల గురించి తల్లిదండ్రులు తెలియజేయాలని కోరారు. పాఠశాలల్లో మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేయడం సరికాదు అన్నారు.
తెలుగు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు జస్టిస్ కె.లక్ష్మణ్ తెలిపారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుందన్నారు. ‘‘కింది కోర్టు వ్యవహారాలు మాతృభాషలో జరుపుకోవచ్చని ఆదేశాలున్నాయి. మాతృభాష ఉండాలని కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి.
మాతృభాషతో మమేకమైతే పిల్లల తెలివితేటలు బాగుంటాయని, అనుకరించడం ద్వారా భాషను నేర్చుకుంటారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తన మాతృభాష మరాఠీ అయినా తెలుగులోనే చదువుకున్నానని తెలిపారు. తన పిల్లలకు పెద్ద బాలశిక్ష ఇచ్చి చదవమంటున్నా అని చెప్పారు. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయన్నారు.