అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, అక్కడే చదివే హిందూ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అక్కడి పాఠశాలల్లోని హిందూ విద్యార్థులకు 2025 నుంచి దీపావళి సెలవు మంజూరు చేయనుంది.
ఈ విషయాన్ని ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యుడు నీరజ్ అంటానీ వెల్లడించారు. దీపావళి సెలవుకు సంబంధించిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ తాజాగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. తద్వారా దీపావళికి సెలువు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా ఒహాయో చరిత్రకెక్కింది.
గవర్నర్ ఆమోదించిన బిల్లు మేరకు ఒహాయో రాష్ట్రంలో నివసించే ప్రతీ హిందూ విద్యార్థి 2025 నుంచి దీపావళి జరుపుకునేందుకు సెలవు తీసుకోవచ్చు. అలాగే ఉగాది, సంక్రాంతి వంటి మరో రెండు మతపరమైన సెలవులు కూడా హిందూ విద్యార్థులు తీసుకోవచ్చు.
ఈ సెలవులకు సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు తమ సంతకంతో కూడిన లేఖను విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూలు ప్రిన్సిపల్ కు అందజేయాల్సి ఉంటుంది. దానిని ప్రిన్సిపల్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.