ఇవాళ మెల్‌బోర్న్‌లో మొదలైన బాక్సింగ్ డే టెస్ట్‌లో విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. అతని మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాగా చెల్లించాలి. పైగా కోహ్లీకి ఒక డీమెరిట్ పాయింట్ కూడా వచ్చింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సీరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇవాళ మొదలైంది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియన్ క్రీడాకారుడు శామ్ కోన్‌స్టాస్‌కు, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య ఒక సంఘటన జరిగింది. పదో ఓవర్ పూర్తయాక ఆటగాళ్ళు మారుతున్నప్పుడు కోహ్లీ భుజం కోన్‌స్టాస్‌కు తాకింది. అప్పుడు ఆటగాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఆస్ట్రేలియన్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా వారిద్దరినీ విడదీసాడు.
గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు క్రీడాకారులు ఇద్దరితోనూ మాట్లాడారు. ‘‘ఆన్ ఫీల్డ్ అంపైర్లు జోయెల్ విల్సన్, మైకేల్ గా, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబన్ షహీద్, ఫోర్త్ అంపైర్ షాన్ క్రెయిగ్ ఆరోపణ చేసారు. మ్యాచ్ రిఫరీ ఆంక్షలు విధించారు. వాటిని కోహ్లీ ఒప్పుకున్నాడు. అందువల్ల విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీపై సస్పెన్షన్ వేటు పడుతుందని పలువురు క్రీడాకారులు అంచనా వేసారు. కానీ అతనిపై లెవెల్ 1 నేరం ఆరోపణ మోపినందున సస్పెండ్ చేయలేదు. మ్యాచ్ ఫీజ్‌లో 20శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. లెవెల్ 2 నేరానికి మూడు నుంచి నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తాయి. నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక టెస్ట్ మ్యాచ్ నుంచి సస్పెండ్ అవుతారు.
అయితే విరాట్ కోహ్లీ తనను ఉద్దేశపూర్వకంగా తాకలేదని కోన్‌స్టాస్ మీడియాకు చెప్పాడు. ‘‘విరాట్ కోహ్లీ నన్ను గుద్దుకున్నాడు. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ప్రమాదవశాత్తు జరిగింది మాత్రమే. క్రికెట్‌లో టెన్షన్‌తో ఏదైనా జరగొచ్చు. ఆ సమయంలో మా ఇద్దరినీ భావోద్వేగాలు ఆవరించి ఉంటాయి’’ అని చెప్పాడు.
‘‘నేను నా గ్లోవ్స్ సర్దుకుంటున్నాను. అంతలో ఒక భుజం నాకు తాకింది. ఆటలో అలా జరగడం సహజమే. ఆ విషయాన్ని నేను అప్పుడు గ్రహించలేకపోయాను’’ అని కోన్‌స్టాస్ వివరించాడు.