పంజాబ్ అంటే ఒకప్పుడు సమృద్ధికి, సంస్కృతికీ పెట్టింది పేరు. అలాంటి పంజాబ్ రాష్ట్రం ఉగ్రవాదపు చీకటి రోజుల నుంచి, డ్రగ్స్ మత్తులో ఊగిన రోజుల మీదుగా ఇప్పుడు క్రైస్తవ మతమార్పిడులలోకి జారుకుంటోంది.
పంజాబ్ దేశభక్తికీ, అనుపమానమైన త్యాగాలకూ పురిటిగడ్డ. అలాంటి పంచనదుల దేశం ఇప్పుడు ముందెన్నడూ లేనంత తీవ్రంగా మతమార్పిడుల ముప్పును ఎదుర్కొంటోంది. పంజాబ్ గురు తేగ్ బహదూర్ వెలిసిన గడ్డ. కశ్మీరీ పండితులను బలవంతపు మతమార్పిడుల నుంచి రక్షించడానికి ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. అందుకే ఆయనకు ‘హింద్ కీ చాదర్’ అనే బిరుదు వచ్చింది. పంజాబ్ గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులను కన్నభూమి. చిన్నారులైన ఆ పిల్లలు ఇస్లాంలోకి మతం మారడం కంటె చావడమే మేలంటూ తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేసారు. అలాంటి పంజాబ్ గడ్డ మీద ఇప్పుడు ప్రతీ పట్టణంలోనూ, ప్రతీ గ్రామంలోనూ క్రైస్తవంలోకి మతమార్పిడులు నిత్యకృత్యం అయిపోయాయి.
పంజాబ్‌లోకి క్రైస్తవ మతం 1834లో ప్రవేశించింది. జాన్ లోరీ, విలియం రీడ్‌లు పంజాబ్‌లో ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించిన మొదటి మిషనరీలు. సిక్కులు, హిందువులు ఎక్కువగా ఉండే పంజాబ్‌లో క్రైస్తవం అంత త్వరగా వ్యాపించలేదు. తొలినాళ్ళలో నగర ప్రాంతాల్లో, అక్షరాస్యుల్లో కొద్దిమంది మాత్రమే క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. ఇటీవలి వరకూ దాదాపు అదే పరిస్థితి. కానీ ఇప్పుడు కథ వేగంగా మారిపోతోంది.
పంజాబ్‌లో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి పెద్ద ప్రణాళికనే అమలు చేసారు. మాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనే ఎవాంజెలిస్ట్‌ను 1862లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేర్చారు, అతన్ని 1864లో పంజాబ్ పంపించారు. సిక్కుల విశ్వాసాన్ని చూరగొనడానికి అతను మొదట సిక్కుమతం స్వీకరించాడు. సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ
సాహిబ్‌ను భాయి కాహన్‌సింగ్ నాభా అనే వ్యక్తి సహాయంతో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తర్వాత సిక్కులు, వారి మత గురువుల గురించి ఆరు సంపుటాలు ప్రచురించాడు. మరోవైపు, కాహన్ సింగ్ నాభా ‘హమ్ హిందూ నహీ’ అనే పుస్తకాన్ని 1897-98లో ప్రచురించాడు. పంజాబీ వేర్పాటువాదమైన ఖలిస్తాన్‌కు ఆ పుస్తకం నుంచే బీజం పడింది. అలా సిక్కు సమాజాన్ని భారతదేశపు ప్రధాన స్రవంతి సాంస్కృతిక జీవనం నుంచి విడదీసేందుకు బ్రిటిష్ వారు ఎంతో సృజనాత్మకమైన కుట్ర పన్నారు.
పంజాబ్‌లో మతమార్పిడులకు రకరకాల మార్గాలు అవలంబిస్తారు. డబ్బులు ఆశ చూపడం, అద్భుతాలు జరుగుతాయని తప్పుడు వాగ్దానాలు చేయడం, కెనడా-అమెరికా-ఇంగ్లండ్-ఆస్ట్రేలియా వంటి విదేశాలకు వీసాలు ఆశ పెట్టడం వంటి పద్ధతులతో మతం మార్చేస్తారు. అలా ఆ రాష్ట్రం డెమొగ్రఫీని ప్రణాళికాబద్ధంగా తారుమారు చేసేస్తున్నారు. ఫలితంగా, పంజాబ్ ఇప్పుడు క్రమంగా క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంగా మారుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్ జనాభాలో క్రైస్తవులు కేవలం 1.3శాతం మాత్రమే. అయితే కొన్ని మీడియా కథనాలు, మిషనరీ గ్రూపులు ప్రకటించిన సర్వేల ప్రకారం ఇప్పుడు పంజాబ్‌లో క్రైస్తవుల జనాభా 15శాతానికి చేరుకుంది. ఆ విషయాన్ని పసిగట్టడంలో, అలా జరక్కుండా నిలువరించడంలో సిక్కు మతగురువులు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి.
క్రైస్తవం ఇప్పుడు దాదాపు పంజాబ్ అంతటా వ్యాపించింది. కానీ ప్రధానంగా గురుదాస్‌పూర్, అమృత్‌సర్, జలంధర్, లూధియానా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. ఆ జిల్లాలను ‘చర్చ్ బెల్ట్’ అని స్థానికులు పిలుస్తూ ఉంటారు. ఆ జిల్లాల్లో కొత్తగా వేలాది చర్చిలు, మిషనరీ కేంద్రాలు నిర్మించారు. గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో అన్ని గ్రామాలూ క్రైస్తవంలోకి మారిపోయాయి. పంజాబ్‌లోని ప్రతీ గ్రామంలోనూ కనీసం రెండు మతం మారిన కుటుంబాలు ఉన్నాయని ఓ అంచనా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 65వేలకు పైగా మిషనరీలు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు, ఒక్క జలంధర్‌లోనే 1500కు పైగా చర్చిలు ఉన్నాయి.
రాజూ రంగీలా, బజీందర్ సింగ్, అంకుర్ నరులా వంటి పాస్టర్లు హిందూ, సిక్కు మతాలలోని దళితులను క్రైస్తవులుగా మార్చేసారు. పంజాబ్‌లో మరో ఆందోళన కలిగించే ట్రెండ్… స్వయంప్రకటిత పాస్టర్లు, అపోస్తలులు. వాళ్ళు నిర్వహించే క్రైస్తవ సువార్త కూటములకు పంజాబీ భాషలో ‘చనగీ సభ’లు అని పేరు. ఆ దొంగ పాస్టర్లు బలహీన మనస్కులైన అమాయక హిందువులను మతం మార్చడానికి ఎన్నో ట్రిక్కులు చేస్తారు. స్టేజి మీద అద్భుతాలు జరుగుతున్నట్లు డ్రామాలు ఆడతారు. దేవుని మహిమతో రోగాలు తగ్గిపోతాయని వాగ్దానాలు చేస్తారు, చనిపోయిన వారిని బతికించేసామంటారు, ఆర్థిక సమస్యలు పరిష్కరించేస్తారు, డ్రగ్స్ వ్యసనం నుంచి విడిపించేస్తామంటారు. వారి ప్రధాన లక్ష్యం అమాయకులైన దళితులు, వాల్మీకి హిందువులు, మజహబీ సిక్కులను ఆకర్షించి, మతం మార్చడమే.
మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవీ దేవతల కీర్తనలు, సుప్రభాతాలను ఏసుక్రీస్తు పాటలుగా మార్చేసి పాడేస్తూ ఉండడం వినే ఉంటారు కదా. సరిగ్గా అలాగే పంజాబ్‌లో సిక్కుల కీర్తనలు, గురుబాణీలను ఏసుక్రీస్తు మీద పాటలుగా మార్చేసారు. వాటి ద్వారా ఏసుక్రీస్తు కూడా తమ దేవుడేనేమో అనే భ్రమ కల్పిస్తారు. మరోవైపు, విదేశాలకు వెళ్ళాలని తొందరపడుతుండే పంజాబీ యువత కూడా ఈ మతమార్పిడి మాఫియాకు సులువుగా దొరికేస్తారు. క్రైస్తవులుగా మతం మారితే వీసాలు పొందడం సులువు అని వాగ్దానం చేసి వాళ్ళ మతం మార్చేస్తుంటారు.
మత మార్పిడులు సులువుగా జరగడానికి మరో ప్రధాన కారణం హిందూ, సిక్కు మతాల్లో వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేయడం. సామాజికంగా, రాజకీయంగా నిర్లక్ష్యానికి గురైన మజహబీ సిక్కులు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఈ క్రైస్తవ మిషనరీలకు ఈజీ టార్గెట్‌లు. సిక్కుమతం ఏర్పడిన ప్రాథమిక సూత్రాలే సమానత్వం, సమన్యాయం. కానీ ఆ మతంలో కూడా కులవివక్ష ఉంది. ఉన్నత కులాల సిక్కులు తరచుగా దళిత సిక్కులను తక్కువ చేసి చూడడం అనే వివక్ష నేటికీ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని క్రైస్తవ మిషనరీలు ఆయా వర్గాలను చేరదీస్తారు. ఆత్మగౌరవం, హుందాగా జీవించే అవకాశం క్రైస్తవంలో మాత్రమే సాధ్యం అని చెబుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. నిజానికి మతం మారినా వారి పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు.
క్రైస్తవం వైపు పంజాబీలను ఆకర్షిస్తున్న మరో ప్రభావం వోకిజం. పంజాబ్‌లో పాశ్చాత్యీకరణ, వోకిజంను అనుసరించడం బాగా ఎక్కువ అయిపోయింది. ఫలితంగా పంజాబ్‌కున్న ఘనమైన దేశీయ సంస్కృతి, సంప్రదాయ విలువలు, ఆధ్యాత్మిక వారసత్వం క్రమంగా క్షీణిస్తున్నాయి.
ఈ యేడాది క్రిస్మస్ సంబరాల సందర్భంగా డిసెంబర్ 20న పాస్టర్ అంకుర్ నరులా ఒక ఊరేగింపు తీసాడు. జలంధర్‌లో 8 కిలోమీటర్ల పొడవున జరిగిన ఊరేగింపులో లక్షల మంది పాల్గొన్నారు. తనకు పంజాబ్‌లో 3లక్షలకు పైగా అనుచరులు ఉన్నారని అంకుర్ నరులా ప్రకటించాడు. జలంధర్‌లోని అతని చర్చ్ భారతదేశంలోని పెద్ద చర్చిల్లో ఒకటి. అతను చనగై సభలు (సువార్త కూటములు) పెట్టినప్పుడు 2లక్షల కంటె ఎక్కువమందే హాజరవుతారని అంచనా.
పంజాబీ సంస్కృతిని ప్రతిబింబిస్తాం అని చెప్పుకునే పంజాబీ గాయకులు క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. గురుగోవిందసింగ్ నలుగురు కుమారులు అమరులైన షహీదీ హఫ్తాను (డిసెంబర్ 21-27) సైతం వదిలిపెట్టి, వారు క్రైస్తవ వేడుకల్లో మునిగి తేలుతూ ఉంటారు. పైగా తామే పంజాబీ సంస్కృతిని నిలబెడుతున్నాం అని గప్పాలు కొడుతుంటారు. పంజాబీ వినోద పరిశ్రమలోని పెద్దతలకాయలందరూ బహిరంగంగానే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
పంజాబ్ తన ఘనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరచిపోకూడదు. ‘‘నేను నా నలుగురు కుమారులనూ త్యాగం చేసాను. వారు చనిపోతే యేమి, వేలాది మంది బతికే ఉన్నారు’’ అని గురు గోవింద్ సింగ్ చెప్పిన మాటలు ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పంజాబీల వారసత్వాన్ని గుర్తుచేస్తాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడా రాష్ట్రం ఆ విలువల నుంచి దూరం జరుగుతోంది.
ఈ సమస్యను ఎదుర్కోడానికి మార్గం.. మతం మారుతున్న ఆ వర్గాలను తాము కూడా అందరితో సమానమే అని భావించేలా చేయడం, ఏ వివక్షా లేకుండా వారికి గౌరవ మర్యాదలు అందేలా చేయడం. పంజాబ్‌లో సామూహిక మత మార్పిడులను నిలువరించడానికి, క్రైస్తవం కోరల నుంచి పంజాబ్‌ను కాపాడడానికీ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, అకాల్ తఖ్త్, హిందూ సంస్థలు కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.