ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని బసాహా మాఫీ గ్రామంలో ఒక విధవ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ విషయాన్ని ఒక ప్రకటనగా తన ఇంటి గోడకు అంటించింది. ఆ పోస్టర్‌లో ఆమె రాసిన విషయమే ప్రత్యేకంగా ఉంది. ‘‘ముస్లిముల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇల్లు అమ్మివేస్తున్నాం’’ అని నేరుగానే రాసేసింది.
ఆ మహిళ పెద్ద కుమార్తె ‘లవ్ జిహాద్’ బాధితురాలు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆమె చిన్న కూతురును కూడా అలాగే వేధిస్తామంటూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. దాంతో ఆ మహిళ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలని భావిస్తోంది.
కొంతకాలం క్రితం మహిళ చిన్నకూతురితో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ దుర్మార్గుల మీద పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసారు. ‘నిందితుల మీద ఇప్పటివరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు. వాళ్ళు గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు’ అని ఆ మహిళ చెప్పింది. అయితే ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆ కేసు నిందితుల్లో ఒక వ్యక్తి ముస్లిం. అతని మీద రౌడీషీట్ కూడా ఉంది. అతను ఆమెను క్రమం తప్పకుండా బెదిరిస్తూనే ఉన్నాడు. దాంతో ఆ మహిళ ఇల్లు వదిలి బైటకు వెళ్ళాలంటేనే భయపడుతోంది. ‘‘ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను, ఎస్‌పి ఆఫీసుకు కూడా వెళ్ళాను. నిందితుల మీద అర్ధవంతమైన చర్య ఏదీ ఇప్పటివరకూ తీసుకోలేదు’’ అంటూ అధికారుల నిరాసక్త వైఖరి గురించి వాపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తనను మానసికంగానూ, భౌతికంగానూ వేధిస్తున్నారని బాధపడింది.
ఆ మహిళ ఉన్న గ్రామంలో ముస్లిం జనాభాయే ఎక్కువ. పైగా వారుండే ప్రాంతంలో అన్నీ ముస్లిం కుటుంబాలే. వారిదొక్కటే హిందూ నివాసం. ఆమె భర్త మరణం తర్వాత చుట్టూ ఉన్న ముస్లిములు ఆమె కూతుళ్ళను వేధించడం పెరిగిపోయింది. గ్రామపెద్ద భూరే మనవడు ఇమ్రాన్, అతని సహచరులూ తన కుమార్తెలను వేధిస్తున్నారని ఆమె చెప్పింది. ఇమ్రాన్ తన పెద్ద కూతురిని రెండుసార్లు ఎత్తుకుపోయాడని, దాంతో మిస్సింగ్ కేసులు పెట్టాల్సి వచ్చిందనీ చెప్పుకొచ్చింది.
2024 అక్టోబర్ 4న మహిళ కుమార్తెలు ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఇమ్రాన్, అతని సహచరుడు ఇర్షాద్ ఆ ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లోని సామాన్లు చిందరవందర చేసేసారు. రూ.35వేల నగదు, నగలు దొంగతనం చేసారు. ఆ సమయంలో చిన్నకూతురిపైనా లైంగికంగా దాడి చేసారు. ‘పోలీసులు కేసు నమోదు చేసారు, నిజమే. కానీ ఆ దుర్మార్గుల మీద సరైన చర్యలు తీసుకోలేదు’ అని ఆవిడ వాపోయింది.
లఖీంపూర్ ఖేరీ పోలీసులు ఆ సంఘటనను ధ్రువీకరించారు. ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసామని, ఎఫ్ఐఆర్ దాఖలయిందనీ వెల్లడించారు. పోలీసులు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ తనకు ఇంకా ముప్పు పొంచే ఉందని ఆమె చెబుతోంది. తన చిన్నకూతురిని కూడా కిడ్నాప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. భద్రత లేని పరిస్థితుల్లో నిస్సహాయురాలైన ఆ మహిళ తన ఇంటిని అమ్మేస్తానంటూ విక్రయానికి పెట్టింది.