హిందువులను ఊచకోత కోస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూన్న దుర్మార్గపు మూకలకు అండగా నిలుస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం… తాము తినడానికి తిండిగింజలు లేవనీ, అవి కొనేందుకు డబ్బులూ లేవనీ గ్రహించింది. అత్యవసరంగా 50వేల టన్నుల బియ్యాన్ని అది కూడా తగ్గింపు ధరలకు ఇవ్వాలని భారత్‌ను కోరింది.
ఆహార నిల్వల తరుగుదల, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డిసెంబర్ 17 నాటికి బంగ్లాదేశ్ దగ్గరున్న తిండిగింజల నిల్వలు 11.48 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. వాటిలో బియ్యం నిల్వలు కేవలం 7.42 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యమే ఆహారంగా ఉండే దేశానికి అది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. దాంతో బంగ్లాదేశ్ స్థానికంగా పంటల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తూనే దిగుమతులకు కూడా ప్రయత్నిస్తోంది.
భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యాన్ని ప్రభుత్వ ప్రాయోజిత ఆహార సరఫరా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచిపెడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 11.17 లక్షల టన్నుల బియ్యాన్ని అలాంటి పథకాల ద్వారా పంచిపెట్టింది.
ఇప్పుడు బంగ్లాదేశ్‌కు బియ్యాన్ని భారతదేశానికి చెందిన బగాదియా బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తుంది. టన్నుకు 456.67 డాలర్ల రేటుకు బియ్యం ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ ధర. నవంబర్ నెలలో బంగ్లాదేశ్‌కు సరఫరా చేసిన బియ్యానికి టన్నుకు 477 నుంచి 499.8 డాలర్ల వరకూ చెల్లించారు. అంటే, భారతీయ కంపెనీ పెద్దమొత్తంలోనే సబ్సిడీ ఇస్తోందన్నమాట.
మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26.25 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నది బంగ్లాదేశ్ ఆలోచన. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, అంత పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకోడానికి బంగ్లాదేశ్ ఆర్థిక స్తోమత సరిపోతుందా అన్నది ప్రశ్న. ఈ యేడాది బంగ్లాదేశ్‌ను కుదిపేసిన వరదల్లో 11లక్షల టన్నుల బియ్యం పాడైపోవడమూ ఆ దేశానికి నష్టమే కలిగించింది.