రాజకీయ అవకాశవాదం కోసం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను ఆదరిస్తున్నట్లు నటిస్తోందని, కానీ ఆ పార్టీ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అంబేద్కర్‌ను గౌరవించలేదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయనను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తమకు సుద్దులు చెప్పడానికి సరిపోదని దుయ్యబట్టారు. నెహ్రూ అంబేద్కర్‌ను అవమానించడాన్ని అప్పట్లోనే కార్టూన్‌గా చిత్రీకరించారంటూ, ఆ కార్టూన్‌ను చూపించారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్ యాదవ్ కాంగ్రెస్ ఇప్పుడు పరాన్నజీవిగా మారిందని వ్యంగ్యోక్తులు విసిరారు.
పార్లమెంట్ సమావేశాలలో జరిగిన పరిణామాలను దేశం మొత్తం గమనించిందని సత్యకుమార్ చెప్పారు. విపక్షాలు సమయం వృధా చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుండి రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. రాజ్యాంగం లో 24వ సవరణ తీసుకొచ్చి ప్రజల ప్రాథమిక హక్కులను కాంగ్రెస్ హరించింది. 44వ సవరణతో పార్లమెంట్‌ను సుప్రీంకోర్ట్ పరిధిలోనుంచి బైటకు తీసుకొచ్చారు. అలా, మన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఎన్నోసార్లు భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.
అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ రాద్ధాంతాన్ని సత్యకుమార్ తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ రచన సమయంలో ఆయనను అవమానించేలా కాంగ్రెస్ కార్టూన్లు విడుదల చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్‌ను నెహ్రూ పలు విధాలుగా అవమానించారు. కాంగ్రెస్ అంబేద్కర్‌ను ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించింది. అంబేద్కర్ మీద పోటీ పెట్టకుండా గౌరవించిన పార్టీ జనసంఘ్ మాత్రమే. అంబేద్కర్ స్మారక నిర్మాణానికి నెహ్రూ అడ్డుపడ్డారు. అంబేద్కర్ సేవలకు భారతరత్న ఇవ్వని నెహ్రూ, తనకు మాత్రం ప్రకటించుకున్నారు. ఆయనను భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ, ఆయన నడిచిన ఐదు ప్రదేశాలలో పంచతీర్థ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు.
జమిలి ఎన్నికలు 2027లో వస్తాయంటూ వైఎస్ జగన్, తన పార్టీ నాయకులను కాపాడుకుంటున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. పార్టీలో నుంచి ముఖ్యమైన నాయకులు బయటకి వెళ్లిపోతున్నారని వారిని కాపాడుకునేందుకు జగన్ 2027లో జమిలి వస్తాయని చెప్తున్నాడు. నిజానికి, జమిలి ఎన్నికలపై కమిటీ వేశారు. ఆ కమిటీ తన విచారణ పూర్తి చేసి అభిప్రాయాల మేరకు ఎప్పుడు జరుగుతాయో చెబుతామన్నారు. పార్లమెంటులో బలం ఉంటే బిల్లు పెట్టాలని రూల్ లేదు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది, దేశాభివృద్ధి కొనసాగుతుంది. రాష్ట్రాలలో ఏడాది పొడుగునా ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటున్న నేపథ్యంలో కొన్ని సమస్యలు తప్పవన్నారు. పాలనాపరంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తోందన్నారు.
ఆ పాత్రికేయుల సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎలిసే కిషోర్, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు.