భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారతపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950 అక్టోబర్ 10న తన రాజీనామా లేఖ సమర్పించారు. అందులో ఆయన, ఎస్సీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి చూపుతోందంటూ నిరాశ చెందారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ ప్రభుత్వం హయాంలో అణగారిన, బలహీన వర్గాలను వ్యవస్థాగతంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన ప్రకటన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: రచనలు, ప్రసంగాలు 14వ సంపుటం, 2వ భాగంలో లభ్యమవుతుంది.
ముస్లిములు, ఎస్సీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను పోల్చిచూసిన అంబేద్కర్ ఇలా అన్నారు. ‘‘ముస్లిముల రక్షణ పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో పోల్చి చూడండి. ప్రధానమంత్రి తన సమయం మొత్తాన్ని, తన శ్రద్ధ అంతటినీ ముస్లిముల రక్షణకే కేటాయించారు.’’
మైనారిటీ హక్కుల రక్షణకు తన మద్దతు ప్రకటిస్తూ అంబేద్కర్ ఇలా చెప్పారు. ‘‘భారతదేశంలో ముస్లిములకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రక్షణ కావలసి వచ్చినా అది ఇచ్చే విషయంలో నేను ఎవరికీ లొంగను, ప్రధానమంత్రికి కూడా తలొగ్గను.’’
అదే సమయంలో ఆయన ఒక నిశితమైన ప్రశ్న సంధించారు. ‘‘కానీ నేను ఒక సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రక్షణ కావలసినది ముస్లిములు ఒక్కరికేనా? షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, భారతీయ క్రైస్తవులకు రక్షణ అక్కర్లేదా? ఆ జాతుల కోసం ఆయన ఏం శ్రద్ధ చూపించారు? నాకు తెలిసినంత వరకూ ఏమీ లేదు. నిజానికి ముస్లిముల కంటె ఎక్కువ శ్రద్ధ కావలసింది, దృష్టి సారించవలసింది ఆ జాతుల మీదనే.’’
వివక్ష, వాగ్దానభంగాల వారసత్వం:
దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ రచన కాలంలో ఎస్సీల ఆందోళనలు, భయాల గురించి అంబేద్కర్ వివరించారు. ‘‘షెడ్యూల్డు కులాలకు రాజ్యాంగపరమైన భద్రత విషయంలో చేసిన వాగ్దానాలను బ్రిటిష్ వారు నిలబెట్టుకోలేదు. ఆ విషయంలో రాజ్యాంగ పరిషత్తు ఏం చేస్తుందన్న విషయం ఎస్సీలకు తెలియదు.’’
ఆ సమయంలో ఆయన ఎస్సీల స్థితిగతుల గురించి ఐక్యరాజ్యసమితికి ఇవ్వడానికి ఒక నివేదిక తయారు చేసారు. కానీ, కొత్తగా ఏర్పడే పార్లమెంటు ఎస్సీల స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని భావించి ఆ నివేదికను ఐక్యరాజ్యసమితికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఎస్సీల రక్షణ కోసం రాజ్యాంగంలో చేసిన ఏర్పాట్ల విషయంలో తనకు కొన్ని అనుమానాలున్నా, ప్రభుత్వం వాటిని సవ్యంగా అమలు చేస్తుందని నమ్మి, ఆమోదించారు.
అయినా పరిస్థితుల్లో ఏ మార్పూ రాలేదంటూ అంబేద్కర్ బాధపడ్డారు. ‘‘ఇవాళ షెడ్యూల్డు కులాల వారి పరిస్థితి ఏంటి? నేను చూసినంత వరకూ గతంలో ఉన్నట్లే ఇప్పడూ ఉంది. అవే పాత దౌర్జన్యాలు, అదే పాత అణచివేత, అదే పాత వివక్ష. ఇవన్నీ గతంలో ఉన్నవే. ఇప్పుడూ ఉన్నాయి. బహుశా అంతకంటె భయంకరంగా ఉండి ఉంటాయి.’’
కుల ఆధారిత వివక్ష కొనసాగుతోందంటూ అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపించారు. ప్రత్యేకించి ఢిల్లీ సమీప ప్రాంతాల నుంచి ఎందరో ఎస్సీలు ఆయన దగ్గరకు వచ్చి తాము ఎదుర్కొన్న వివక్ష గురించి, పోలీసుల ఉదాసీనత గురించీ చెప్పుకునేవారట. ‘‘ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన షెడ్యూల్డు కులాల ప్రజలు నా దగ్గరకు వచ్చేవారు. కుల వ్యవస్థ వల్ల వారు ఎదుర్కొన్న వివక్ష గురించి చెప్పుకునేవారు. వారి ఫిర్యాదులను నమోదు చేసుకోడానికి, వారికి సాయం చేయడానికీ పోలీసులు నిరాకరించేవారు. అలాంటి వందల కేసులు నేను చూపించగలను’’ అని అంబేద్కర్ చెప్పుకొచ్చారు.
అంబేద్కర్ భావోద్వేగకరమైన, విస్పష్టమైన ప్రకటన షెడ్యూల్డు కులాలకు వ్యతిరేకంగా తీవ్రమైన నిర్లక్ష్యం, వ్యవస్థీకృత పక్షపాత ధోరణులను ఎండగట్టింది. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ ప్రాధమ్యాలు, నిబద్ధత గురించి తీవ్రమైన ప్రశ్నలు సంధించింది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీన వర్గాల ప్రతినిధిగా తనను తాను చూపించుకుంటోంది, న్యాయానికి చిహ్నంగా అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని తిరుగుతోంది. కానీ ఆ పార్టీయే వారిని వంచించిన విషయంలో నిందితురాలు. ఇప్పుడు అంబేద్కర్ పట్ల కాంగ్రెస్‌కు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ, డొల్ల ప్రకటన మాత్రమే. అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఆ పార్టీ నాయకులు న్యాయం కోసం అర్ధించడం ఒక మెరమెచ్చు మాట, ఫ్యాషనబుల్ ప్రకటన మాత్రమే. అదెలా ఉందంటే, తన జీవితాంతం హిందువులను వేటాడి వేటాడి తన జీవిత కాలంలో ఊచకోత కోసిన హిందువులను ఔరంగజేబు న్యాయం అడిగినట్లుంది.