ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా మదన్‌పురా ప్రాంతంలో జనసమ్మర్దం ఉన్నచోట ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయం కొన్ని దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. నిన్న సోమవారం నాడు ఒక హిందూ సంస్థ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని తెరిచే ప్రయత్నం చేసారు. అది సిద్ధేశ్వర మహాదేవుడి ఆలయం అని వారు చెబుతున్నారు. ఆ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తెరిపించాలనీ, నిత్య పూజాదికాలు జరిపించాలనీ కోరుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం వారణాసిలో సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ వైరల్ అయింది. ‘‘కాశీ వీధుల్లో ఇక శివాలయం తాళాలు వేసి ఉంది’’ అని ఆ సందేశం సారాంశం. దాన్ని సనాతన రక్షాదళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు పండిట్ అజయ్ శర్మ చూసారు. దాంతో ఆయన బృందం మదన్‌పురా బయల్దేరింది. అది ముస్లిములు ఉండే, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ ఒక ఇంటి దగ్గర ప్రాచీన దేవాలయ నిర్మాణాన్ని వారు చూసారు. అది ఎన్నో యేళ్ళుగా తాళం పెట్టి వదిలేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
‘‘ఆ ఆలయం గురించి కాశీఖండంలో ఉంది. వారణాసి రూపురేఖలను వర్ణించే అత్యంత ప్రాచీన గ్రంథం అది. పుష్పదంతేశ్వర దేవాలయానికి దక్షిణంగా ఉన్న ఈ దేవాలయాన్ని సిద్ధేశ్వర మహాదేవుడి ఆలయం అంటారు. ఆ గుడి దగ్గరలోనే ఒక సిద్ధతీర్థం కూడా ఉండేది’’ అని అజయ్ శర్మ చెప్పారు.
స్థానికుల కథనం ప్రకారం ఆ ఆలయం కనీసం 250 సంవత్సరాల పురాతనమైనది. కానీ గత పదేళ్ళకు పైగా మూతపడే ఉంది. ఆ ఆవరణలోకి ప్రవేశించిన అజయ్ శర్మ బృందం, ఏళ్ళ తరబడి నిర్లక్ష్యం వల్ల ఆ ఆలయంలో దుమ్మూధూళీ పేరుకుపోయాయని గ్రహించింది.
ఆలయం బైటపడిన విషయం తెలియగానే పెద్ద చర్చే మొదలైంది. రాజకీయ, ధార్మిక సంస్థలు రంగంలోకి దిగాయి. అయితే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య ఆ సంఘటనపై దృఢంగా స్పందించారు. ‘‘అణచివేత ఎక్కడున్నా, దేవాలయాలు ఎక్కడ లభించినా, అక్కడ పూజాపునస్కారాలు జరుగుతాయి’’ అని ప్రకటించారు. అలాంటి ధార్మిక స్థలాలపై అధికారం ప్రకటించుకోవడం, వాటిని తిరిగి తెరిపించడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మాటలతో అర్ధమవుతోంది.
ఆ స్థలం యజమాని మొహమ్మద్ షాబుద్దీన్, ఆ దేవాలయంలో పూజలు చేసుకోడానికి తనకు ఏ అభ్యంతరమూ లేదని చెబుతున్నాడు. ఆ ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా శాంతియుతంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే తమవైపు నుంచి అభ్యంతరాలేమీ లేవన్నాడు.
మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ ఆ ప్రాంతంలో కొన్ని వర్గాలు మతసామరస్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు మొదలుపెట్టాడు.
విషయం వెలుగు చూసిన వెంటనే పరిస్థితి తీవ్రతను, ఆలయం ఉన్న ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉండడాన్నీ దృష్టిలో పెట్టుకుని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కాశీ జోన్ డిసిపి గౌరవ్ బన్సల్ దేవాలయం ఉనికిని ధ్రువీకరిస్తూనే దానిపై యాజమాన్య హక్కుల మీద ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులు మోహరించారు.
ప్రస్తుతానికి అధికారులు ఆ ప్రాంతాన్ని సీల్ చేసేసారు. ఆలయం చరిత్ర గురించి, దాని యాజమాన్యం గురించీ దర్యాప్తు మొదలుపెట్టారు. అవి తేలేదాకా ఆ ప్రాంతాన్ని సీల్ చేసి ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.