తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ తాజాగా నిన్న మరోసారి వివాదం రేకెత్తించారు. దేవాలయాలు మూర్ఖత్వాన్ని ప్రోత్సహిస్తాయనీ, పాఠశాలలు హేతుబద్ధత నేర్పిస్తాయని వ్యాఖ్యానించారు.
‘‘ఇవాళ సమాజంలో రెండు దారులున్నాయి. ప్రజలు తమ పిల్లలను గుడికైనా పంపవచ్చు, బడికైనా పంపవచ్చు. గుడులు మూఢనమ్మకాలను, కపటత్వాన్ని, మూర్ఖత్వాన్నీ ప్రోత్సహిస్తాయి. పాఠశాలలైతే హేతువాదాన్ని, జ్ఞానాన్ని, శాస్త్రీయతను, జీవితంలో మార్పునూ తెస్తాయి. మన పిల్లలను ఎక్కడికి పంపాలన్నది మనమే ఎంచుకోవాలి’’ అని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన డేహ్రీ జిల్లా దేవరియా గ్రామంలో ఓ టెక్నికల్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ గతేడాది తాను మహిషాసురుడి వారసుడిని అని చెప్పుకోవడం వివాదానికి దారి తీసింది. మతం, కులం, సామాజిక వ్యవస్థల గురించి తరచుగా వ్యాఖ్యలు చేస్తారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఆదర్శమే తన అలంరణ అని చెబుతుంటారు. కులవ్యవస్థలోని అంచెల పద్ధతి, మతానుసరణ విధానాలపై ఆయన గతంలో చేసిన ప్రసంగాలు విమర్శల పాలయ్యాయి.
తాను చేసే ప్రకటనలు తన సొంతం కావని, సంఘసంస్కరణ ఉద్యమకారిణి సావిత్రీబాయి ఫూలే బోధనల నుంచే తీసుకున్నాననీ ఫతే బహదూర్ సింగ్ చెప్పుకొచ్చారు.