ఘోరం జరిగింది. జార్జియాలోని ఓ రిసార్టులో 11 మంది భారతీయులు అనుమానాస్పదంగా మృతిచెందారు. స్కై రిసార్ట్ గూడౌరి రెస్టారెంట్ ప్రాంతం హవేలీలో కార్బన్‌మోనాక్సైడ్ పీల్చడం వల్ల 11 మంది భారతీయులు సహా మొత్తం 12 మంది చనిపోయినట్లు జార్జియా పోలీసులు తెలిపారు. వీరంతా విహారయాత్రకు వెళ్లి రిసార్టులోని రెండో అంతస్తులో రాత్రి పూట నిద్రపోయారు. వారి గది బయట ఓ పెద్ద జనరేటర్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాని నుంచి విడుదలైన కార్బన్‌మోనాక్సైడ్ వల్లే వీరంతా చనిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు.
మృతుల శరీర భాగాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరవాత ఈ మరణాలపై మరింత స్పష్టత రానుంది.
భారతీయుల మృత్యువాతపై జార్జియా అధికారులు భారత రాయభార కార్యాలయానికి సమాచారం అందించారు. భారత అధికారులు అక్కడకు చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. వారి కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయులతోపాటు మరో వ్యక్తి కూడా చనిపోయారు. అతను ఏ దేశానికి చెందిన వారనేది తెలియాల్సి ఉంది.