జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. సోమవారం నాడే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. 129 రాజ్యాంగ సవరణ బిల్లు, మరో బిల్లుతోపాటు, జమిలి ఎన్నికల బిల్లు డిసెంబరు 17న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని పార్టీలతో జేపీసీ వేయనున్నారు. దీనిపి బీజేపీ ఎంపీ ఛైర్మన్‌గా ఉంటారు. పార్టీల బలాలను బట్టి కమిటీలో చోటు కల్పిస్తారు.
జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం.. పార్లమెంటు, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.అయితే ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు పక్కనబెట్టి పార్లమెంటు, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమిలోని 15 పార్టీలు సంసిద్దత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా చర్చను చేపట్టి అందరి అభిప్రాయాలు తీసుకోనుంది.