వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు టీటీడీ సిద్ధమైంది. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిన టీటీడీ, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలను ఈ పదిరోజుల పాటు రద్దు చేసింది.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ఈ పదిరోజుల పాటు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. 3వేల మంది యువ శ్రీవారి సేవకులను ఉత్తర ద్వార దర్శన సేవల కోసం వినియోగించనున్నారు.
డిసెంబర్ 28న ‘డయల్ యువర్ ఈవో’
టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28న జరగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో కార్యక్రమం ఉంటుందని ఈవో శ్యామల రావు తెలిపారు. భక్తులు 0877-2263261 కు ఫోన్ చేసి తమ సందేహాలను, సూచనలను తెలపవచ్చు.