మహాలక్ష్మి అమ్మవారు, వినాయక స్వామి విగ్రహాలు ధ్వంసం
రోడ్డు కాంట్రాక్టర్ తీరుపై స్థానికులు ఆగ్రహం
హిందూ ఆలయం విషయంలో రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్ దారుణంగా వ్యవహరించాడు. భక్తుల మనోభావాలు, సనాతన ధర్మ విశ్వాసాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహారించి ఆలయాన్ని కూల్చి దేవతా విగ్రహాలు ధ్వంసం చేయించాడు. నెల్లూరులో ఈ ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు విస్తరణ పేరుతో నాగమ్మ ఆలయాన్ని కూల్చివేయడంతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను తొలగించారని సనాతనులు మండిపడుతున్నారు. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి వేయడంతో పాటు వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
వివరాల్లోకి వెళితే… నెల్లూరు డైకస్రోడ్డు సెంటర్లో రహదారి వెడల్పు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నాగమ్మ ఆలయాన్ని కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేత పనులు చేపట్టడంపై స్థానిక హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరుతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న బీజేపీ నాయకుడు మిడతల రమేష్ ఆలయం వద్దకు చేరుకుని కాంట్రాక్టర్ తీరును తప్పుబట్టారు. నాలుగు దశాబ్దాలకుపైగా డైకస్రోడ్డు సెంటర్లో పూజలందుకుంటున్న నాగమ్మ పుట్ట ఆలయం ఎలా పగలగొడతారని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా అత్యుత్సాహంతో ఆలయాన్ని కూలగొట్టడం క్షమించరాని నేరమన్నారు. ఘటనపై హిందూ చైతన్య వేదిక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
R&B అధికారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్ ఆలయాన్ని పగలగొట్టినట్లు ఆ శాఖ ఈఈ తెలిపారు. రోడ్డు విస్తరణ సమయంలో కాంట్రాక్టర్ సరైన పద్ధతి పాటించలేదన్నారు.