‘‘బీఫ్ తినడం ఇస్లామిక్ ధర్మం. బీఫ్ ఉండని హోటళ్ళు హిందుత్వ ఏజెంట్లు. అన్ని రెస్టారెంట్లలోనూ బీఫ్ వడ్డించండి లేదా మూసేయాల్సిందే’’ అంటూ ఒక ముస్లిం గ్రూప్ బంగ్లాదేశ్‌లోని రెస్టారెంట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఢాకా కేంద్రంగా పనిచేసే ‘ముస్లిం వినియోగదారుల హక్కుల కౌన్సిల్’ సంస్థ బుధవారం బంగ్‌షల్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించింది. బీఫ్ వడ్డించని రెస్టారెంట్లను బాయ్‌కాట్ చేయాలన్నది వారి డిమాండ్. అన్ని రెస్టారెంట్లలోనూ బీఫ్‌తో చేసిన వంటకాలు తప్పనిసరిగా ఉండాలని, అలా చేయని రెస్టారెంట్లు మూసేయాలనీ వారు హెచ్చరించారు. బీఫ్ అమ్మని రెస్టారెంట్లు ఇస్లామిక్ భావజాలానికి వ్యతిరేకులు అని ముద్ర వేసేసారు.
ముస్లిం వినియోగదారుల హక్కుల కౌన్సిల్ కన్వీనర్ ఆరిఫ్ అల్ కబీర్ ‘‘బీఫ్ అనేది ఇస్లామిక్ గుర్తింపు. పాశ్చాత్య దేశాల రెస్టారెంట్లలో హలాల్ ఆహారం ఉండదు. ఆ దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఆ సంస్థ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు పాత ఢాకాలోని బంగ్‌షల్ ప్రాంతంలో ఉన్న హోటల్ అల్ రజాక్ ముందు భేటీ అయ్యారు. ‘‘బీఫ్ లేని రెస్టారెంట్లు భారతదేశపు తొత్తులు, హిందుత్వ ఏజెంట్లు. అలాంటి హోటళ్ళను బాయ్‌కాట్ చేయండి’’ ‘‘ఆవు పేడా, ఆవు మాంసమా? ఏది కావాలి? – ఆవు మాంసమే కావాలి’’ వంటి నినాదాలతో హోరెత్తించారు.
ఆరిఫ్ అల్ కబీర్ చెప్పిన ప్రకారం ‘‘ఒంటె మాంసం తినడం తప్పనిసరి కాదు. కానీ యూదుల ఆహార నియమాలతో పోలిస్తే ఇస్లాం నియమాలకు కట్టుబడి ఉండాలి కాబట్టి ముస్లిములకు ఒంటె తినడం తప్పనిసరి. అలాగే బీఫ్ తినడం తప్పనిసరి కాదు, కానీ హిందూ విశ్వాసాలను తిరస్కరించాలి కాబట్టి ముస్లిములు ఆవుమాంసం తినాల్సిందే.’’ దానికి అతను కురాన్ ‘సూరా అల్ బగర’లోని వాక్యాన్ని ఉటంకించాడు.