హమాస్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, నిషేధిస్తూ స్విట్జర్లాండ్ పార్లమెంట్ బిల్లును పాస్ చేసింది. ప్రతినిధుల సభలో ఆ బిల్లుకు దాదాపు పూర్తి ఆమోదం లభించింది. హమాస్‌పై నిషేధం ప్రతిపాదన మీద బుధవారం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 168మంది ఓటు వేయగా, కేవలం ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. సెనేట్‌లో ఆ బిల్లు మంగళవారం ఆమోదం పొందింది.
రెండు సభల్లోనూ ఆమోదం పొందడంతో హమాస్‌పై నిషేధం బిల్లు చట్టరూపం దాల్చింది. ఫెడరల్ కౌన్సిల్ ప్రవేశపెట్టిన ఆ బిల్లు ప్రకారం మొదట హమాస్‌ను ఐదేళ్ళ పాటు నిషేధిస్తారు. బిల్లు పార్లమెంటులో పాస్ అయిపోయింది కాబట్టి, అది అమల్లోకి వచ్చే తేదీని ఫెడరల్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. స్విట్జర్లాండ్ ఇప్పటివరకూ చట్టం చేసి మరీ నిషేధించిన సంస్థలు రెండే రెండు… అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్. ఇప్పుడు హమాస్ మూడో సంస్థగా నిలిచింది.
స్విట్జర్లాండ్ ప్రతినిధుల సభ లెబనాన్‌కు చెందిన షియా ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా పైన కూడా నిషేధం విధించాలని భావిస్తోంది. నిన్న దానిగురించి కూడా చర్చ జరగాల్సి ఉంది, కానీ సమయాభావం వల్ల జరగలేదు.
ఈ యేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద ఉగ్రదాడి చేసిన తర్వాత హమాస్‌ను నిషేధించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం, పార్లమెంట్ రెండూ భావించాయి. ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆ అంశంపై చర్చించి బిల్లును పాస్ చేయడంతో హమాస్, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ళపాటు నిషేధం విధించినట్లయింది. ఆ నిషేధాన్ని పొడిగించడానికి పార్లమెంటుకు అవకాశం ఉంది.
హమాస్‌ను ఇప్పటికే పలుదేశాలు నిషేధాజ్ఞలు విధించారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీల్యాండ్, జపాన్ తదితర దేశాలు నిషేధించాయి. హమాస్ మీదా, దానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న సంస్థల మీదా యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. భారత్ అక్టోబర్ 7 నాటి దాడిని ఉగ్రవాద దాడిగా గుర్తించినట్లు ప్రకటించింది.