బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి తమ రాష్ట్రంలోకి ప్రవేశించిన 850 మందిని బహిష్కరించామని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. భిలాయ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అక్రమ చొరబాట్లు, వామపక్ష అతివాదం అనే రెండు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఆ సందర్భంగా, రాష్ట్ర జనసంఖ్య సమగ్రతను పరిరక్షించడం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
బస్తర్ ప్రాంతం నుంచి 500 మంది, కావర్ధా ప్రాంతం నుంచి మరో 350 మంది చొరబాటుదారులను బహిష్కరించామని విజయ్ శర్మ తెలియజేసారు. కొండగావ్ ప్రాంతంలో మరో 46మంది చొరబాటుదారులు కస్టడీలో ఉన్నారని, వారిపైనా బహిష్కరణ వేటు పడుతుందన్నారు. అక్రమ చొరబాట్లపై అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అటువంటి చొరబాటుదారులను గుర్తించి, నిర్బంధించడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు.
బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పెద్ద తలనొప్పిగా మారారు. ఎలాంటి తనిఖీలూ లేకుండా చొరబాటుదార్లు రాష్ట్రంలో చొచ్చుకుపోతుండడాన్ని వ్యతిరేకిస్తూ ‘సర్వ ఆదివాసీ సమాజ్’ అనే గిరిజనుల స్వచ్ఛంద సంస్థ 2024 ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించింది. బంగ్లాదేశీయులు ఛత్తీస్‌గఢ్‌లో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నిచోట్లా అక్రమంగా చొరబడిపోతున్నారని ఆరోపించింది. ఆ చొరబాటుదారులు తమ ప్రాంత సాంస్కృతిక స్వభావానికి, జనసంఖ్యాత్మక స్వరూపానికీ ముప్పు కలుగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితి మాటున అక్కణ్ణుంచి చొరబాట్లు పెరిగిపోతున్నాయని, వాటిని ఆపాలనీ ఛత్తీస్‌గఢ్ గిరిజనులు కోరుతున్నారు. పలు జిల్లాల్లో బంగ్లాదేశీ చొరబాటుదార్లు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక గిరిజన ప్రజానీకం ఆవేదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశీ చొరబాటుదారులపై కొరడా ఝుళిపిస్తోంది.
మరోవైపు, నక్సల్స్‌పై దశాబ్దాల తరబడి చేస్తున్న పోరాటంలో ఛత్తీస్‌గఢ్ ఓ చారిత్రక విజయాన్ని సాధించింది. బస్తర్, కొండగావ్ మావోయిస్టు రహిత జిల్లాలుగా మారాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ‘‘సమీకృత అభివృద్ధి ప్రయత్నాలు, భద్రతా బలగాల ఆపరేషన్ల వల్లనే ఈ విజయం సాధ్యమైంది. దేశద్రోహులపై ప్రభుత్వ పోరాటంలో ఇదొక కీలకమైన ముందడుగు. మా సునిశితమైన విధానాల వల్ల మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. తద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమమైంది’’ అని చెప్పారు.
డిసెంబర్ 15న ‘బస్తర్ ఒలింపిక్స్’ ముగింపు ఉత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మరికొన్ని కార్యక్రమాలను ప్రకటిస్తారని తెలుస్తోంది.