బంగ్లాదేశ్ ప్రజలకు తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే హక్కు కచ్చితంగా ఉంది. కానీ దానర్ధం మైనారిటీల హక్కులను దోచుకోమని కాదు కదా! ఉనికిలో లేని బంగ్లాదేశ్ ప్రభుత్వపు సోకాల్డ్ సలహాదారు మహమ్మద్ యూనుస్ ఏమంటున్నాడో చూసారా. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు అనేది భారత మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమేనట. రాజకీయ ప్రత్యర్ధిని హింసించడం అనేదాన్ని ప్రజాస్వామ్యం అనుమతిస్తుందన్నట్లు, అవామీ లీగ్ మద్దతుదారులకు వ్యతిరేకంగా కోపంతో రాడికల్స్ చేస్తున్న దాడులను అతను సిగ్గులేకుండా సమర్థిస్తున్నాడు. అతను చెబుతున్న కబుర్లలో నిజాలెన్ని? చూద్దాం.
మూకబలంతో షేక్ హసీనాను బలవంతంగా ప్రధానమంత్రి కుర్చీనుంచి దిగిపోయేలా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లో చట్టం, న్యాయం అనేవే లేకుండా పోయాయి. హసీనా నివాసాన్ని లూటీ చేయడం, అక్కడ చేసిన విధ్వంసం అన్న ప్రత్యక్షంగా చూసాం. ఆ అధికార శూన్యంలో మూడు వర్గాలు నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. అవి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి : చిన్న వ్యాపారాల ప్రతినిధి), జమాతే ఇస్లామీ (పాకిస్తాన్ అనుకూలమైన, కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ), హిజ్బుత్ తహ్రీర్ (ప్రపంచమంతటినీ ఇస్లామిక్ రాజ్యం చేసేయాలని పనిచేస్తున్న సంస్థ). ఈ మూడు గ్రూపులతోనూ వామపక్ష-ఉదారవాద వర్గం కలిసి పనిచేస్తోంది. ఈ చట్టవిరుద్ధమైన కుట్రను చట్టబద్ధం, హేతుబద్ధంగా చూపడానికి ప్రయత్నిస్తోంది. అప్రజాస్వామికంగా జరిగిన బలవంతపు అధికార మార్పిడి తర్వాత దేశంలోని జైళ్ళను తెరిచేసారు. ఆందోళనకారులమని చెప్పుకునే వ్యక్తులు జైళ్ళ నుంచి 1500కు పైగా ఖైదీలను వదిలేసారు. వారిలో చాలామంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
అల్‌ఖైదా స్ఫూర్తితో పనిచేస్తున్న అతివాద సంస్థ ‘అన్సరుల్లా బంగ్లా టీమ్’ వ్యవస్థాపకుడు ముఫ్తీ జసీముద్దీన్‌కు ఆగస్టు 26న బెయిల్ లభించింది. బంగ్లాదేశ్‌లో సుమారు లక్ష ఆయుధాలను దోచుకున్నారు. అది దేశ రక్షణకు, శాంతిభద్రతలకు పెద్ద ప్రమాదం.
బంగ్లాదేశ్‌కు అస్థిరత, అధికార మార్పిడిలో నాటకీయ పరిణామాలూ కొత్తేమీ కాదు. అలాంటి ప్రతీ సందర్భంలోనూ మైనారిటీలు, అందునా ముఖ్యంగా హిందువులే లక్ష్యం. వారిలో కూడా అత్యధికులు దళితులు, గిరిజనులే ఉన్నారు. అలా, బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 30 నుంచి 7శాతానికి పడిపోయింది.
ఇస్కాన్ స్వామి చిన్మయ్ ప్రభుదాస్ అరెస్టు, ఆయనకు ప్రాథమికమైన చట్టపరమైన హక్కుల నిరాకరణతో బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై ప్రపంచదేశాలు కొంతవరకూ దృష్టి సారించాయి. ఆగస్టు 5న అధికారం మారిన నాటినుంచీ బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల జీవితాలు నరకప్రాయమైపోయాయి. హెఫాజత్ ఎ ఇస్లామ్ వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్‌లోని హిందువులను, ఇస్కాన్ సభ్యులనూ నరికి చంపేలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చాయి. హిందువుల ఇళ్ళు తగులబెట్టిన, దోచుకున్న, ధ్వంసంచేసిన హృదయ విదారకమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. హిందూ దేవాలయాలను, దుర్గాపూజ పండాల్స్‌ను ధ్వంసం చేసారు. అక్కడక్కడా, తమ ఉదార హృదయాన్ని ప్రపంచానికి చూపించడం కోసం ఒకట్రెండు పండాల్స్‌ను రక్షిస్తున్నట్లు ఫొటోలు వీడియోలూ విడుదల చేసారు. ఇది మనకు బాగా పరిచితమైన, వామపక్షులు తరచు ఆడే నాటకమే. యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి అడ్డూ చెప్పకపోవడంతో అతివాద గ్రూపులు మరింత రెచ్చిపోయాయి. ఇస్కాన్ స్వాముల కేసును వాదించకూడదని బంగ్లాదేశ్ లాయర్లు తీసుకున్న నిర్ణయం భారత మీడియా ప్రచారమా? తమపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాల గురించి మహిళలు రోదిస్తూ చెప్పిన మాటలు భారత మీడియా ఊహలా? హిందువుల దుకాణాలపై, ఇళ్ళపై దాడులు చేసినవారెవరు? హిందూ టీచర్లను తాము కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిందెవరు? బంగ్లా ఆర్మీ దారుణంగా చంపేసిన దళిత బాలుడు హృదయం రవిదాస్ చేసిన నేరమేమిటి? ఆ పిల్లవాడు ఏమైనా అవామీలీగ్ కార్యకర్తా? జరిగిన, జరుగుతున్న దారుణాలు, నేరాలకు యూనుస్ సర్కారు దగ్గర జవాబు లేదు.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్ అక్టోబర్ ఆఖరివారంలో బంగ్లాదేశ్‌ను సందర్శించారు. వారు అక్కడ హిందువుల దారుణమైన దుస్థితి గురించి ఒక్కటంటే ఒక్కమాటయినా మాట్లాడలేదు. ఎలా మాట్లాడగలరు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో నడుస్తున్న చట్టవిరుద్ధమైన పరిపాలనకు 92మంది నోబెల్ బహుమతి విజేతలు, 197 ప్రపంచ దేశాల అధినేతలు అండగా నిలిచారు. ఉదారవాదులు, అభ్యుదయవాదులు అని తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకున్న మహానుభావుల చూపులు ఇప్పుడు ఇటువైపు, బంగ్లాదేశీ హిందువుల వైపు లేవు. ప్రపంచంలో నిజమైన మైనారిటీ వర్గమైన హిందువులు, మెజారిటేరియన్ సుప్రిమసిస్ట్ మతాలకు ఆహారమైపోతుంటే వారు మరోవైపు చూస్తూ ఉన్నారు. బహుళ దేవతారాధన రూపంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉన్నమతం హిందుత్వం ఒక్కటి మాత్రమే. అంతేకాదు, మిగతా మతాలను గౌరవించేదీ హిందూధర్మం మాత్రమే.
అప్ఘానిస్తాన్, పాకిస్తాన్‌లలో హిందువులను ఊచకోత కోసినప్పుడు నోరు మెదపని అంతర్జాతీయ మెజారిటేరియన్ సంస్థలు హిందువులకు పాఠాలు చెబుతున్నారు. కశ్మీర్ లోయలో ఊచకోతకు గురై, మైనారిటీలుగా మారిపోయి, బలవంతంగా లోయనుంచి తరిమివేయబడిన హిందువులకు నీతిబోధలు చేసిన అంతర్జాతీయ సంస్థలే ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనూ హిందువులను ప్రశ్నలు అడగడమే విధానంగా పెట్టుకున్నారు. మయన్మార్‌లో రోహింగ్యాలు ఉగ్రవాద కార్యకాలాపాలకు పాల్పడుతుంటే వారిపై దాడులు చేస్తుంటే అమెరికా ఆంక్షలు విధించింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యను ఖండించడం ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల సెలెబ్రిటీలకూ తప్పనిసరి అయిపోయింది. ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనేది అన్నిదేశాల్లోనూ ట్రెండ్‌గా నిలిచింది. పోలీసుల దాష్టీకాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనేది సంకేతంగా మారిపోయింది. భారతదేశంలో ఏ కరడుగట్టిన నేరస్తుడిపై చట్టపరమైన చర్య ఏదైనా తీసుకుంటే, ఆ నేరస్తుడు ముస్లిం అయితే వెంటనే పాశ్చాత్య మీడియాకు, మానవ హక్కుల సంస్థలకు ఒళ్ళంతా చిరచిరలాడిపోతోంది. అదొక మతస్వేచ్ఛను ఉల్లంఘించే అంశంగా మారిపోతుంది. అయితే, హిందువుల విషయానికి వస్తే వారికి అలాంటి హక్కులేమీ ఉండవు. వారికోసం ఎలాంటి ఆందోళనలూ జరగవు. వారివి మానవ హక్కులు కావు. మతపరమైన ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా హిందువులు ఏమాత్రం ప్రతిఘటన చూపినా, అది వారికే వ్యతిరేకంగా తిరగబడుతుంది. ప్రపంచంలో నిజమైన మైనారిటీలు అయిన హిందువుల మానవ హక్కులను ఆమోదించాలా, గౌరవించాలా అనే విషయంలో అంతర్జాతీయ సమాజం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించవలసిన సమయం ఆసన్నమైంది.
వేల యేళ్ళ దాడులను, ఊచకోతలను తట్టుకుని హిందువులు నిలవగలిగారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన సంస్కృతి కలిగిన హిందువులు విదేశీ దాడులను, విమతాల దాడులను కేవలం ప్రతిఘటించలేదు, వాటిని తట్టుకుని ఉనికి నిలబెట్టుకున్నారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారు. హిందూమతం నేర్పిన విలువలు ప్రపంచ శాంతికి, సమష్టి సమాజ జీవనానికీ నేటికీ ఆధారభూతంగానే ఉన్నాయి. అన్ని రకాల అర్చనా ఆరాధనా విధానాలను ఆమోదించడం, గౌరవించడం, వాటన్నింటినీ నిజమైనవేనని పరిగణించడం, మతాంతరీకరణలకు దూరంగా ఉండడం, మతాన్ని వ్యక్తిగత ఎంపికగా భావించడం, బలాత్కారమూ హింసా మతానికి వ్యతిరేకమని చాటడం, ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు శాస్త్రీయ విజ్ఞానం, ఆర్థిక స్వావలంబన కూడా ఎదగాలని ప్రయత్నించడం… అవీ హిందూమత సారాంశం.
హిందూమత ప్రబోధాన్ని ఆచరణలో పెట్టడానికి హిందువులు ఒక నిర్ణయం తీసుకోవాలి. ‘ఏక్ హై తో సేఫ్ హై’ … ‘అందరం కలసి ఉంటే సురక్షితంగా ఉంటాం’. ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా హిందువులు అందరం ఆ నిర్ణయానికి అంకితమవుదాం. అస్తిత్వం కోసం హిందువులు పడే ప్రయాసకు ఏ అంతర్జాతీయ సంస్థా లేక సోకాల్డ్ ఉదారవాద ప్రజాస్వామ్యమూ సాయపడదు. ప్రపంచంలో మెజారిటీగా ఉన్న అబ్రహామిక మతాలు దానికి ఒప్పుకోవు. అందుకే హిందువులు తమ విభిన్న సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం చేయాల్సింది మన మనుగడ కోసం, మన ఉనికి కోసం, మన అస్తిత్వం కోసం పోరాటం అన్న విషయాన్ని గ్రహించాలి, అర్ధం చేసుకోవాలి. ఇది ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదు’ అన్న విషయాన్ని ప్రస్తుత ప్రపంచ వర్తమాన పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి హిందువులు అందరూ లేచి, సమైక్యంగా నిలబడాలి. ప్రపంచ మానవాళికి మంచి చేయడం కోసం, సర్వమానవ సౌభ్రాతృత్వం అన్న హైందవ భావనను విశ్వవ్యాప్తం చేయడం కోసం, హైందవీయ విలువలతో కూడిన మానవ హక్కులతో ప్రపంచాన్ని ప్రకాశింపజేయడం కోసం మనందరం కలసికట్టుగా ఉండాలి.