బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని ఢాకాలోని ఇస్కాన్ దేవాలయాన్ని మతోన్మాద మూకలు ధ్వంసం చేశాయి. మైనార్టీ హిందువులు, దేవాలయాలు లక్ష్యంగా మతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయని కోల్‌కతా ఇస్కాన్ అంతర్జాతీయ ప్రతినిధి రాధారామన్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బంగ్లాదేశ్‌లో దేవాలయాలు, హిందువులపై దాడులు ఆపేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
గత నెలలో మైనార్టీ హిందువులపై దాడులకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్మోయ్ తరపును వాదించడానికి వచ్చిన ఓ న్యాయవాదిని కోర్టు సమీపంలోనే అల్లరిమూకలు కొట్టి చంపాయి. కేసు విచారణకు న్యాయవాది లేకపోవడంతో వచ్చే నెలకు వాయిదా పడింది.
బంగ్లాదేశ్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయే ప్రమాదముందని బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. రద్దీ ప్రాంతాలు, ప్రార్ధనా స్థలాలు, రైల్వే స్టేషన్ల వద్ద ఉగ్రవాదులు బాంబులు పేల్చే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించేందుకు విదేశాంగశాఖ అధికారులు ఢాకాకు బయలుదేరారు.