తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం అందజేసిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) నిర్ణయించింది.
టీటీడీ 2008లోనే ఈ విధానానికి సంకల్పించగా అనివార్య కారణాలతో నిలిపివేశారు. ఈ పథకం కింద విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించనున్నారు.
అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలు కల్పిస్తారు. అలాగే రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పించనున్నారు. ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందజేయనున్నారు. సంవత్సరానికి ఒకసారి బహుమానంగా దుపట్టా, బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.
మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్ళ పాటు ఈ విధానం చెల్లుబాటులో ఉంటుంది.