దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 7నవోదయ విద్యాలయాలను కేటాయించింది.
ఏపీలో అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల కోసం రూ.5,872 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులు చదువుకునే వీలుంటుంది.
కొత్తగా 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం కేంద్రం రూ.2,359.82 కోట్లు ఖర్చు చేయనుంది. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్య అభ్యసించవచ్చు.
విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి.