దేవాలయాల నిర్వహణ భక్తుల చేతిలో కాకుండా ప్రభుత్వాల చేతిలో ఉండడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థ అవసరాల కోసం దేవాలయాల ఆస్తులను, ఆలయాలకు భక్తులు ఇచ్చే కానుకలనూ వాడేసుకుంటున్నారు. మరోవైపు, హిందువులను అసమర్థులుగా మార్చేసిన లౌకికవాదం కారణంగా దేవాలయాల్లో, ఆలయ ప్రాంగణాల్లో, ఆలయాల పరిసరాల్లో అన్యమతస్తులు ఇప్పటికే చొరబడిపోయారు. ‘మీ మతం మీరు ఆచరించుకోండి, మా మతం జోలికి రావొద్దు’ అన్నా వినకుండా వితండ వాదనలు చేస్తూ, రాజ్యాంగానికే వక్రభాష్యాలు చెబుతూ ఆలయాలను నాశనం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం దానికొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ నేపథ్యంలో దేశంలోని ఆలయాల నిర్వహణను హిందూ భక్త జనులకు అప్పగించాలంటూ విశ్వహిందూ పరిషత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే, చిరకాలంగా ఉన్న ఒక వ్యవస్థను తొలగించాలంటే అంత సులభం కాదు. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. ఆ ప్రయత్నం ‘హైందవ శంఖారావం’ ద్వారా చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర శర్మ ‘ఆంధ్రా టుడే’ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు.
♠ దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని చెబుతున్నారు కదా. అది ఎలా ఉండాలి? అటువంటి నమూనాలు ఏమైనా మనకున్నాయా?
♦ రాజ్యాంగం ప్రకారం దేవాలయాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. కేంద్రం జాబితాలోనూ, రాష్ట్రాల జాబితాలోనూ ఉన్నాయి. కాబట్టి దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే విధంగా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం కూడా చట్టాలు చేయాలి. దేశంలో ఇప్పటివరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుల్లో దేవాలయాల నిర్మాణానికి ముందు ఏర్పడిన ట్రస్టులు రెండున్నాయి. ఒకటి సోమనాథ్ దేవాలయ ట్రస్టు (1951), రెండవది శ్రీరామజన్మభూమి దేవాలయ ట్రస్టు (2020). ఆ రెండు ట్రస్టులూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ట్రస్టులు. వాటిని ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వ బాధ్యత. తర్వాత, దేవాలయ నిర్మాణమూ, విస్తరణా, నిర్వహణా, ఉత్సవాలూ, ధర్మకర్తలూ, పదవీ విరమణలూ, కొత్తవారిని తీసుకోవడం అలాంటి నిర్ణయాలు అన్నింటిలోనూ ట్రస్టులు స్వతంత్రంగానే వ్యవహరిస్తాయి తప్ప ప్రభుత్వ జోక్యం లేదు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఒక ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలి. దాని పేరు ఏదైనా కానివ్వండి, దానికొక నియమావళి తయారుచేయాలి. ఆ పరిషత్తులో ఎవరుండాలి? ప్రతీ దేవాలయానికీ సంప్రదాయమైన పద్ధతిలో ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ప్రతీ దేవాలయానికీ ఒక పరంపర ఉంది. ఆగమశాస్త్రపరంగా నిర్మాణము, నిర్వహణా జరుగుతాయి. ఆ ఆగమశాస్త్రానికి, ఆ సంప్రదాయానికి సంబంధించిన ప్రముఖులు, అందులో నిష్ణాతులు, ఆ ధార్మిక పరిషత్తులో ఉండాలి. నిర్వహణలో అనుభవజ్ఞులైన విశ్రాంత అధికారులు ఉండాలి. వదాన్యులైన ధనవంతులకు కొదవ లేదు, అలాంటివారికి ప్రాతినిధ్యం కల్పించాలి. ఇష్టదైవం కోసం సర్వస్వాన్నీ సమర్పించడానికి సిద్ధంగా ఉన్న భక్తమండలికి అవకాశం ఇవ్వాలి. న్యాయవ్యవస్థలో అనుభవం ఉన్నవారిని కూడా కలుపుకోవాలి. అలాంటి వారితో రాష్ట్రస్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. ఆ మేరకు ఒక నమూనా ముసాయిదాను విశ్వహిందూ పరిషత్ తయారు చేసింది. దాన్ని ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
♠ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవాలయాలు హిందువులకు ఆధ్యాత్మిక శ్రద్ధా కేంద్రాలుగా పని చేస్తున్నాయా?
♦ ఆధ్యాత్మిక ప్రచారం అన్నదే లేదు. హారతికి డబ్బులు, దర్శనానికి డబ్బులు, విఐపి దర్శనానికి డబ్బులు, భక్తుల్లో విఐపిలు, విఐపిలు కానివాళ్ళు ఏమిటి. దేవుడి ముందు అందరూ సమానమే. దాన్ని వదిలేసారు, దైవిక భావనల పట్ల శ్రద్ధాసక్తులు కనిపించడం లేదు. ధార్మిక ప్రచారం ఏం జరుగుతోంది? దేవాలయం అనేది ఒక సంస్కార కేంద్రం, సాముదాయిక కేంద్రం, ధర్మప్రచార కేంద్రం, సేవా కేంద్రం. ఒకప్పుడు దేవాలయాలు ఆ విధంగా నిర్వహించబడేవి. ఇప్పుడు గుడుల్లో కనీస సౌకర్యాలే లేవు. లోపలికి వెళ్ళేముందు కాళ్ళు కడుక్కునే వ్యవస్థ ఏది? చెప్పులు పెట్టుకోడానికి పద్ధతి ఏది? దేవాలయంలోకి ప్రవేశించగానే సందేశం అందించే విధంగా ఇవాళ ఎన్ని దేవాలయాల్లో పంచాంగం రాసి ఉంటోంది? నైతిక జీవన మూల్యాలు, భక్తికి సంబంధించిన సూక్తులు రాసిఉండే దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? ధర్మప్రచారం కోసం, సంస్కృతి విశేషాలను తెలియజేయడం కోసం కార్యక్రమాలు ఏమున్నాయి? శీతాకాలాల్లో దేవాలయం కేంద్రంగా హరికథలు, బుర్రకథలు చెబుతుండేవారు. ఇప్పుడవన్నీ తీసేసారు. ఉత్సవాలు నిర్వహించాలంటే డబ్బులు లేవు కాబట్టి నిర్వహించవద్దని ఒత్తిడి చేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు… మంత్రిగారో ఎమ్మెల్యే గారో వస్తున్నారు, ఆయనకు టైం లేదు, పూజ ఇంతసేపు ఎందుకు, ఐదు నిమిషాల్లో పూజ చెయ్యాలి, ఇరవై నిమిషాలు ఎందుకు చేయాలి అని ఆదేశించే అధికారులు… ఇంత ప్రసాదం ఎందుకు అని ప్రశ్నించే వారు… ఇలాంటి గందరగోళాల మధ్య ఆధ్యాత్మికతకు, శ్రద్ధకూ తావే లేదు.
♠ దేవాలయాల్లో అన్యమతస్తులు సైతం ఉద్యోగాలు చేస్తున్నారు. రికార్డుల్లో హిందువులుగా చూపించుకుంటూ ఉద్యోగాన్ని వదలడం లేదు. అలాంటి వారి విషయంలో ఏం చేయాలి?
♦ వాళ్ళను తొలగించడమే. ఆ విషయంలో మారుమాటే లేదు. ఎప్పటినుంచో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులు పరిష్కరించండి. అన్యమతస్తులు కొత్తవాళ్ళను నియమించకుండా ఉండండి. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, పూలూ ప్రసాదాలూ కొనాలన్నా హైందవేతరుల నుంచే కొనుక్కోవలసి వస్తోంది. భగవంతుడి మీద విశ్వాసం లేనివాడు అమ్ముతుంటే భక్తులు కొనుక్కోవలసిన దుస్థితి. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు. మహమ్మదీయులకు, క్రైస్తవులకూ కూడా ఎండోమెంట్ బోర్డ్ పెడితే మీకిష్టమేనా అనవచ్చు. వాళ్ళకు లేదు కాబట్టి మాకు ఇవ్వమని అడగడం లేదు. మాకు అవసరం కాబట్టి మాకు ఇవ్వమని అడుగుతున్నాం.
♠ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి? అసలు వాటి రికార్డులే సవ్యంగా ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఆ విషయంలో విహెచ్‌పి ఆలోచన ఏమిటి?
♦ సరైన హిందూ ఆలయ ధార్మిక పరిషత్ నిర్మాణమే దానికి తగిన పరిష్కారం. 1936 నాటి రికార్డులు ఉన్నాయా లేవా? ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి రికార్డులు ఉన్నాయా లేవా? ఆ కంపెనీ దేవాలయాలకు సంబంధించి మొట్టమొదట చట్టం చేసినప్పటి రికార్డులు ఏం చెబుతున్నాయి, ఇప్పటి రికార్డులు ఏం చెబుతున్నాయి… ఆ రెండింటినీ పరిశీలిస్తే తెలిసిపోతుంది. వాటి ప్రకారం సర్వేచేసి, రెండింటినీ సరిపోలిస్తే ఎంత అన్యాక్రాంతం అయ్యాయో తేలిపోతుంది కదా. రికార్డులు ఉన్నాయి. వాటిని అప్‌డేట్ చేయాలి. పాత రికార్డులతో సరిపోల్చాలి. ఆస్తులకు సంబంధించి ముందు ఇన్వెంటరీ నిర్వహించాలి. తరతరాలుగా సంవత్సరానికి ఎకరానికి కౌలు ఐదు రూపాయలే. దాన్ని కూడా వసూలు చేయడం లేదు. ఎకరానికి ఒక బస్తా ధాన్యం వసూలు చేయడం లేదు. పెంచడం లేదు. కౌలుదారులు ఉన్నారు, ఈనాం భూములు ఉన్నాయి. సేవలు చేసేవారికి ఈనాములిచ్చారు. ఈనాములను అమ్ముకునే అధికారం లేదు. కానీ అమ్ముకోడాన్ని అనుమతించారు. ఇలా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ జోక్యం, రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండకూడదు.
♠ దేవాలయాలకు రాజకీయ ఒత్తిడుల నుంచి, ప్రభుత్వ పెత్తనం నుంచి విముక్తి కావాలంటున్నారు. అప్పుడు దేవాలయాల నిర్వహణకు ప్రత్యామ్నాయం ఏమిటని భావిస్తున్నారు?
♦ నిర్వహణకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదు. ఆ నిర్వహణ అనేది రాజకీయ నాయకులతో ఏర్పడే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కమిటీలతో జరగకూడదు. ధార్మిక పరిషత్ ఏర్పడాలి. ఆ మేరకు చట్టం చేయాలి. నమూనా చట్టం ముసాయిదా అందించడానికి విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉంది.
♠ ఈ అంశాల మీద హిందువుల్లో చైతన్యం కలిగించాలంటే ఏం చేయాలి?
♦ ఈ అన్ని విషయాల మీదా ప్రజల్లో, ముఖ్యంగా హిందువుల్లో అవగాహన, చైతన్యం కలిగించే ఉద్దేశంతోనే 2025 జనవరి 5వ తేదీన కార్యక్రమాలు చేపడుతున్నాం. విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దానికి రాష్ట్రం నలుమూలల నుంచీ భారీగా హిందువులను సమీకరిస్తున్నాం. తమ ధర్మం పట్ల, తమ దేవాలయాల పట్లా హిందువుల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వాలకు ఎలుగెత్తి చాటుతాం. దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ధార్మిక పరిషత్తు లాంటి చట్టబద్ధమైన పరిషత్తు వంటి వ్యవస్థను రూపొందించాలన్న డిమాండ్‌ను హైందవ శంఖారావం ద్వారా ప్రభుత్వాల ముందు ఉంచుతాం.
♠ హైందవ శంఖారావం గురించి ప్రజల్లోకి ఎలా తీసుకువెడుతున్నారు?
♦ రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికీ, ప్రతీ ఊరికీ, ప్రతీ పట్టణానికీ వెడుతున్నాం. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, హితచింతకులు ప్రజల్లో ఈ కార్యక్రమం గురించి అవగాహన కలగజేస్తారు. ‘చలో విజయవాడ’ అనే పిలుపుతో హిందువులను సమీకరిస్తున్నాం. మన దేవాలయాల పరిరక్షణ కోసం మన ప్రభుత్వాలకు మన ఆకాంక్షలు తెలియజేయడానికి రావలసిందిగా గ్రామగ్రామాల నుంచీ హిందువులను ఆహ్వానిస్తున్నాం. సాధుసంతులు, భక్తులు, దేవాలయాల కమిటీలు అందరినీ పిలుస్తున్నాం. ఇంత ఉదాత్తమైన లక్ష్యంతో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి హిందూ సమాజం నుంచి సానుకూలమైన, ఉత్సాహభరితమైన స్పందన లభిస్తుందని ఆకాంక్షిస్తున్నాం.
♠ దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఆవశ్యకత గురించి, దాని సాధ్యాసాధ్యాల గురించి, దానికి కావలసిన కార్యాచరణ గురించి వివరంగా చెప్పారు. విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదనలకు దేశంలోని అన్ని ప్రభుత్వాలూ ఒప్పుకోవాలని, ఒప్పుకుంటాయనీ ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.